- కొల్పూరు, తంగిడి వద్ద నిర్మించేందుకు నిర్ణయం
- కర్నాటక మంత్రి బోసురాజుతో మంత్రి సమావేశం
హైదరాబాద్, వెలుగు: నీటి వినియోగంపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, అందుకు తగ్గట్టుగా కర్నాటకతో ఒప్పందం చేసుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల వినియోగం, తాగు- సాగునీటి అవసరాలపై కర్నాటక రాష్ట్ర చిన్ననీటి తరహా శాఖ మంత్రి బోసురాజు, మంత్రి ఉత్తమ్ సోమవారం సెక్రటేరియెట్ లో భేటీ అయ్యారు. సంయుక్తంగా తెలంగాణ, కర్నాటక మధ్య బ్యారేజీ నిర్మాణంపై చర్చించారు.
ఒకటి కృష్ణా నదిపై కొల్పూర్ వద్ద, మరొకటి భీమానదిపై తంగిడి గ్రామం వద్ద కట్టే ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరిపారు. వీటి నిర్మాణంపై మరింత విస్తృతంగా చర్చ కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను బోసురాజుకు సమగ్రంగా వివరించినట్టు ఆయన తెలిపారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై చర్చించామన్నారు. తెలంగాణ సాగు, తాగునీటి హక్కుల పరిరక్షణ, భవిష్యత్ అవసరాలకు అనుసరించాల్సిన ప్రాథమిక చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలు కర్నాటక ముందుంచినట్టు ఆయన చెప్పారు.
కృష్ణా నది జలాశయాల వినియోగంపై తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి చర్చించినట్టు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్యన జరిగిన చర్చలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, శివకుమార్ రెడ్డి, వంశీకృష్ణ, రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్ బాబు, కర్నాటక రాష్ట్ర చిన్నతరహా నీటిపారుదల శాఖ కార్యదర్శి బీకే పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
