- 4.21 లక్షల మందికి ప్రమాద బీమా
- 18 నుంచి 70 ఏండ్ల మత్స్యకారులు అర్హులు
- 2026–27 ఆర్థిక సంవత్సరానికి సర్కారు ఆమోదం
హైదరాబాద్, వెలుగు: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ప్రమాదాల్లో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి 18 నుంచి 70 ఏండ్ల వయసున్న 4,21,767 మంది మత్స్యకారులకు ఈ బీమా వర్తింపజేయనుంది. 2026 జూన్ 1 నుంచి ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యులైన అర్హులందరికీ ఈ పాలసీ వర్తించేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించనుంది.
రాష్ట్ర వాటా చెల్లింపు..
ఒక్కో మత్స్యకారుడికి రూ.79.96 చొప్పున ప్రీమియం కట్టాల్సి ఉండగా, ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాను భరిస్తాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,34,79,673 చెల్లించనుంది. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల బీమా అమలు కాలేదన్న విమర్శలున్నాయి. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. పూర్తి వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు చెల్లిస్తారు. అలాగే ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరితే రూ.25 వేల వరకు వైద్య సహాయం అందుతుంది.
బీమా రక్షణ కల్పిస్తున్నాం: మంత్రి వాకిటి శ్రీహరి
మత్స్యకారుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రమాద సమయాల్లో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ బీమా రక్షణ కల్పిస్తున్నామన్నారు. గతంలో రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ప్రస్తుత ప్రభుత్వం తన వాటాను పూర్తిగా చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
