
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువను అక్రమంగా నిర్మిస్తోందని, తనిఖీ చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ బుధవారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ కు లేఖ రాశారు. ఏపీ విభజన యాక్ట్ ప్రకారం.. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకున్నాకే కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని గుర్తు చేశారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ 2) ఇంకా అమల్లోకి రాలేదని, ఆ ట్రిబ్యునల్లో కేటాయింపులను చూపుతూ ఏపీ ప్రాజెక్టు కడుతోందన్నారు. బోర్డు మెంబర్ రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని టెక్నికల్ టీం ఈ ఏడాది జనవరిలో ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజీలను పరిశీలించిందని గుర్తు చేశారు. అప్పుడే ఆర్డీఎస్ రైట్ కెనాల్ కూడా చెక్ చేయాల్సి ఉన్నా, బోర్డు తనిఖీ చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వం కుడి కాలువకు నీటిని తరలించడానికి హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి చేసి గేట్లు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వెంటనే తనిఖీ చేసి, ఆ పనులను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.