కృష్ణా బోర్డుకు తెలంగాణ  లేఖ

కృష్ణా బోర్డుకు తెలంగాణ  లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: అనుమతుల్లేకుండా నిర్మించే ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ ఎంపీ సింగ్‌‌కు ఇరిగేషన్‌‌ ఈఎన్సీ (జనరల్‌‌) మురళీధర్‌‌ శనివారం లేఖ రాశారు. గండికోట రిజర్వాయర్‌‌ నుంచి వైఎస్సార్​ జిల్లా ముద్దనూరు మండలం మంగపట్టణం గ్రామానికి నీళ్లు తరలించేందుకు లిఫ్ట్‌‌ స్కీం, పైప్‌‌లైన్‌‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారని తెలిపారు. అదే జిల్లాలో గండికోట రిజర్వాయర్‌‌ ఫోర్‌‌ షోర్‌‌లో మరో పంపుహౌస్‌‌ నిర్మించి పైపులైన్‌‌ ద్వారా నీళ్లు తరలించే ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారన్నారు. సత్యసాయి గంగా కెనాల్‌‌పై 106.90 కి.మీ.ల వద్ద తూము నిర్మిస్తున్నారని, హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ ఫేజ్‌‌ -2లో కొత్తగా లిఫ్ట్‌‌ నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ నీటి ఆధారంగా జిల్లేడుబండ రిజర్వాయర్‌‌ నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్‌‌, డిజైన్‌‌ల కోసం అనుమతులు ఇచ్చారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్‌‌ఎంబీ, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి లేకుండా చేపట్టినవేనని తెలిపారు. ఈ ప్రాజెక్టుల సమాచారం కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే వరకు వాటిని చేపట్టకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్డీఎస్‌‌ ఖర్చునూ భరించాలే

తుంగభద్ర నుంచి నీటి వాటాలు ఏ మేరకు ఉన్నాయో అలాగే ఆర్డీఎస్‌‌ నిర్మాణ ఖర్చునూ ఆయా రాష్ట్రాలు భరించాలని తెలంగాణ తేల్చిచెప్పింది. అందుకు విరుద్ధంగా నిర్మాణ వ్యయంలో ఎక్కువ మొత్తం తెలంగాణే భరించాలన్న బోర్డు నిర్ణయం ఆమోదయోగ్యం కాదంది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు మెంబర్‌‌ సెక్రటరీకి మురళీధర్‌‌ లేఖ రాశారు.