తెలంగాణలో వార్ వన్ సైడే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో వార్ వన్ సైడే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని.. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి మూడోసారి అధికారంలోకి రాబోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె.. అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడారు. 

రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీల సాధికారత కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని, చేసిన మంచి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని చెప్పారు. గత ఎన్నికల్లో 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 65 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయని పనులను కేసీఆర్ పదేండ్లలోనే చేసి చూపించారన్నారు. ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌గా మల్లికార్జున ఖర్గే ఉండగా, ఆయనను కాదని గాంధీ కుటుంబం ఆరు గ్యారంటీ హామీలను ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 

తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. షోలాపూర్​ పర్యటనలో భాగంగా కవిత స్థానిక చేనేత పరిశ్రమలను సందర్శించి, అక్కడి కార్మికులతో మాట్లాడారు. అనంతరం స్థానిక బీడీ కార్మికులను కూడా ఆమె కలిశారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రలోనూ తీసుకొస్తామని తెలిపారు. కాగా, షోలాపూర్‌‌‌‌‌‌‌‌ బీఆర్ఎస్ నేతలు, స్థానిక మహిళలతో కలిసి పుంజల్ మైదాన్‌‌‌‌‌‌‌‌లో కవిత బతుకమ్మ ఆడారు.