- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరణకు మరింత సమయం కోరిన బీఆర్‌ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి
- సభలో కడియం వీడియో ఫుటేజీ ఇస్తేనే
- కౌశిక్ వివరణ ఇస్తాడని వాదన
- ఈ నెల 30కి వాయిదా వేస్తూ చైర్మన్ రేవూరి నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం ఈ నెల 30కి వాయిదా పడింది. బుధవారం అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, వెడ్మ బొజ్జు అధికారులు పాల్గొన్నారు. మిగతా సభ్యులు కూనంనేని సాంబశివ రావు, పద్మారావు, మధుసూదన్ రెడ్డి గైర్హాజరయ్యారు.
ఈ కమిటీ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపైనే చర్చించారు. కమిటీ పంపిన నోటీసుకు కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరగా.. అందుకు చైర్మన్ నిరాకరించారు. అయితే ఆనాటి సభలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుతో పాటు కడియం శ్రీహరికి సంబంధించిన వీడియో ఫుటేజీ తెప్పించాలని, దాన్ని పరిశీలించిన తర్వాతే కౌశిక్ రెడ్డి వివరణ ఇస్తారని ప్రశాంత్ రెడ్డి కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
కడియం వీడియోను సభకు తెప్పించే అధికారం తనకు లేదని చైర్మన్ అన్నట్లు సమాచారం. తాము కూడా ఇప్పటికే సీఎం రేవంత్, పొన్నం ప్రభాకర్, వీర్లపల్లి శంకర్, మందుల సామేల్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిటీ చైర్మన్ ను ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపైనే విచారణ చేస్తామనడం సరైంది కాదని ప్రశాంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది.
సభ్యుడిపై స్పీకర్ నుంచి వచ్చిన సిఫారసు ఆధారంగా 3 నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉందని కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అనడంతో.. మూడు నెలల్లో విచారణ పూర్తిచేయాలని ఎక్కడా లేదని ప్రశాంత్ రెడ్డి అన్నట్లు సమాచారం.
బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డికే మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నందున అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించి కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చేందుకు కమిటీ చైర్మన్ మరింత సమయం ఇవ్వాలనే అభిప్రాయాన్ని రాకేశ్ రెడ్డి వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 30న జరుగనున్న ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
