ఇయ్యాల ( ఆగస్టు 31 ) అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్... ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు..?

ఇయ్యాల ( ఆగస్టు 31 ) అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్... ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు..?
  • చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు?
  • 2018లో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సంపత్‌ కుమార్‌‌ను బహిష్కరించిన తీరును పరిశీలించిన స్పీకర్​ కార్యాలయం

హైదరాబాద్, వెలుగు: ​ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై  జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్‌‌‌‌లోని ప్రధాన అంశాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఇప్పుడు 665 పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో పెట్టనుంది. మంత్రులందరికీ ఈ​ నివేదిక కాపీలను పంపింది. చర్చ సందర్భంగా మంత్రులందరూ మాట్లాడనున్నట్లు తెలుస్తున్నది. ఈ నివేదిక సమర్పణ, దానిపై జరిగే చర్చ  సమయంలో ఎలాంటి అవాంతరాలు  లేకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

అందులో భాగంగా కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా ఏ ఒక్క శాసనసభ్యుడు సభలో ఆటంకాలు సృష్టించకుండా, గందరగోళం కలిగించకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రత్యేకించి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు సభ వెల్‌‌‌‌లోకి వచ్చి ఆందోళన చేస్తే, స్పీకర్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే.. సస్పెన్షన్ లేదా బహిష్కరణలాంటి చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. 

ఈ సందర్భంలోనే, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి, సంపత్ కుమార్‌‌‌‌‌‌‌‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన నాటి ఫైల్‌‌‌‌ను అధికారులు మరోసారి పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.   పంచాయతీరాజ్​ చట్టం –2018లోని 285(ఏ) ను సవరిస్తూ ప్రభుత్వం గతంలో తెచ్చిన ఆర్డినెన్స్‌‌‌‌కు తగ్గట్టుగా ఇప్పుడు అసెంబ్లీ సెషన్​ ఉండటంతో బిల్లుల రూపంలో తెస్తున్నది. ఆదివారం ఈ బిల్లులను ప్రభుత్వం సభలో పెట్టనున్నది.  

గతంలో 285(ఏ) నిబంధనలో ‘స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతం మించరాదు’ అని ఉండగా ఇప్పుడు ఈ క్యాప్​ను ఎత్తివేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఉండేలా చట్టాన్ని సవరిస్తున్నారు.