- యాప్ కంపెనీల ఆర్డర్లపై 1 శాతం నుంచి 2 వరకు సెస్
- కార్మికుల సంక్షేమానికే వినియోగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ కార్మికుల (ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికులు)కు భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్ (ఓలా, ఉబెర్), ఈ -కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న వర్కర్ల సంక్షేమానికి ఉద్దేశించిన గిగ్ వర్కర్ల (సామాజిక భద్రత సంక్షేమం) బిల్లు-2024 ను ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
అసంఘటిత కార్మికులకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది గిగ్ కార్మికులు ఉండగా అందులో మెజారిటీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. వీరంతా యాప్ ఆధారిత సేవలపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ.. వీరికి ఉపాధి భద్రత లేకపోవడం, సరైన వేతనాలు అందకపోవడం, ప్రమాదాలు జరిగితే ఆదుకునే వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలను ఈ బిల్లు ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..
* గిగ్ కార్మికుల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు ‘సామాజిక భద్రత , సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉంటుంది.
* ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఐడీ) కేటాయిస్తారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందుతాయి.
* అగ్రిగేటర్లు (సంస్థలు) జరిపే లావాదేవీల నుంచి 1శాతం నుంచి 2 వరకు నిధులను సేకరించి, వాటిని సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని కార్మికుల బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.
* యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించేందుకు బలోపేతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బందుల నివారణకు ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు పనిచేస్తాయి. కార్మికులను పనిలో నుంచి తొలగించినా లేదా పేమెంట్లు ఆపేసినా.. తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 'ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు' జిల్లా స్థాయి అధికారులతో కూడిన యంత్రాంగం ఉంటుంది.
* ఇంతకాలం యాప్ కంపెనీలు ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇస్తున్నాయి, పేమెంట్లు ఎలా లెక్కిస్తున్నాయి అనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఇకపై యాప్ కంపెనీలు ఇష్టమొచ్చినట్లు రేట్లు తగ్గించడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం కుదరదు. కార్మికులకు ఇచ్చే పేమెంట్లలో పారదర్శకత ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తారు.
