- వేషం కట్టి ఆటపాటలతో ఆకట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- విజేతలకు అవార్డులు అందజేత
- ఫుట్‌బాల్‌లో సీఎంకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
హైదరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ విమర్శలు, సభా చర్చలతో తీరిక లేకుండా గడిపే ప్రజాప్రతినిధులు కాసేపు తమలోని కళలు, ప్రతిభాపాటవాలను బయటకు తీశారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల ‘స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’లో భాగంగా ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.
"నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉండే నాయకులకు కాస్త విశ్రాంతి, మానసిక ఉల్లాసం అవసరం" అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల సమయంలోwwప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహించే సంప్రదాయం ఉండేదని, తెలంగాణ వచ్చాక అది కనుమరుగైందన్నారు. ఆ సంప్రదాయాన్ని మళ్లీ పునరుద్ధరించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది విద్యార్థులకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
"యూనివర్సిటీల్లోని విద్యార్థులు కొందరు మత్తుకు బానిసలై వ్యసనాల వైపు వెళ్తున్నారు. ఇది తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తోంది. విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండి, క్రీడలు, కళల వైపు దృష్టి సారించండి" అని కోరారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా స్పోర్ట్స్ పాలసీ తెచ్చామన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రూ. 700 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడలను కూడా కొందరు రాజకీయం చేసి బహిష్కరించడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది అయినా వారంతా పాల్గొనాలని కోరారు. అనంతరం, వివిధ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో భాగంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ చాటిన సీఎం రేవంత్ రెడ్డికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకున్నారు.
ఎవరెవరు ఏ వేషం కట్టారంటే..
కల్చరల్ మీట్ లో మంత్రి వాకిటి శ్రీహరి దుర్యోధనుడి వేషధారణలో ఇచ్చిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన గంభీరమైన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గద్దర్ వేషం కట్టి ఆడారు. ఇక బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకున్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సీనియర్ నటుడు శోభన్ బాబు నటించిన పాటకు రామచంద్ర నాయక్ చేసిన డాన్స్ కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచింది. ఆయన స్టెప్పులకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ కూడా గిరిజన పాటకు ఉత్సాహంగా నృత్యం చేసి అలరించారు.
