- కేటీఆర్ అవినీతి కేసులను సీఎం ఎందుకు పట్టించుకోవట్లే?
- బీఆర్ఎస్- బీజేపీ పొత్తు ఎన్నటికీ సాధ్యం కాదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, ఒకరినొకరు కాపాడుకోవడమే లక్ష్యంగా కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేవలం అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల దగ్గర జరిగిన రూ.9 వేల కోట్ల అవినీతిపైనే విచారణకు ఎందుకు పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. కేవలం హరీశ్ రావును ఇరికించాలనే ప్లాన్‌తోనే రేవంత్ ఈ పరిమిత విచారణకు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. కేటీఆర్, కేసీఆర్ కుటుంబం పాత్ర ఉన్న చోట విచారణ జరిపించే దమ్ము రేవంత్ కు లేదని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు రేవంత్ సలహాలు ఇస్తున్నారనీ, దీన్ని బట్టే వారి మధ్య బంధం అర్థమవుతోందని తెలిపారు. ఫార్ములా ఈ -రేస్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, ఫాంహౌజ్ కేసుల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నా.. రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని సంజయ్ ప్రశ్నించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్లాన్ అని, అందుకే కేటీఆర్ వంటి అతిపెద్ద అవినీతిపరుడిని రేవంత్ కాపాడుతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబంతో చేతులు కలపం..
బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ కొట్టిపారేశారు. కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకమైన బీజేపీ.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో ఎన్నటికీ చేతులు కలపబోదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కొన్ని చోట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ తో కలిసి వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం తప్పని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఎవ్వరు మద్దతిచ్చినా తప్పనీ, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. కవిత పార్టీ ఇంకా స్టార్టింగ్ ట్రబుల్ లో ఉందన్నారు. అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన సరికాదని చెబుతూనే.. రేవంత్ సర్కార్ తీరును సంజయ్ తప్పుబట్టారు. అసలు అసెంబ్లీలో కమిటీలే లేనప్పుడు, కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా ఒక డ్రామా అని కొట్టిపారేశారు.
