- బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితులు, ఆదివాసీలపై అకృత్యాలు పెరుగుతున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2016 నాటి ‘ఉనా’ ఘటన బాధితులకు ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇటీవల గుజరాత్‌కు చెందిన దళితులు, ఆదివాసీ ప్రతినిధుల బృందంతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను ఆయన ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలపై తరచూ దాడులు జరుగుతున్నాయని, బాధిత కుటుంబాలు న్యాయం కోసం చేసే పోరాటంలో అండగా ఉంటామని పేర్కొన్నారు. ఉనా ఘటనలో ఒక వ్యక్తికి 19 చోట్ల ఎముకలు విరిగేలా కొట్టారని, మరొకరిని సజీవ దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
