- వందల కొద్దీ పేపర్లు ఇస్తే ఎట్లా?
- అనువైన నివేదికలు ఇవ్వండి: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించడానికి తాము రెడీగా ఉన్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. వందల కొద్దీ పేపర్లు ఇస్తే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచారణ పారదర్శకంగా చేయడానికి అనువైన నివేదికలను ఇవ్వాలని కోరారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. సీబీఐ విచారణ కోరామని చెబుతూ.. బీజేపీ, బీఆర్ఎస్దోస్తానా వల్లే ముందుకు సాగడం లేదని చెప్పడం సరికాదన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికనే సీఎం సీబీఐకి పంపించారని పేర్కొన్నారు. ఎలాంటి స్పష్టత లేకుండా వందలాది పేజీలు ఇస్తే సీబీఐ ఆఫీసర్లు ఎంక్వైరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేవలం 3 బ్యారేజీలపై విచారణ చేయించి ఎటూ తేల్చకుండా.. కొందరు ఆఫీసర్ల పేర్లు పెట్టి ఎంక్వైరీ చేయాలనడం సమంజసం కాదన్నారు.
కేసీఆర్‌ను శిక్షించే ఉద్దేశం సీఎంకు లేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి, మిషన్‌భగరీథ, మిషన్‌కాకతీయ, ఈ–కార్ రేసింగ్, ఓఆర్ఆర్టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని, విచారణ జరిపి కేసీఆర్కుటుంబసభ్యులను జైలుకు పంపిస్తానని చెప్పి ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వేసిన సిట్లు, గిట్లు సరిగా పని చేయట్లేదా? రిపోర్టులు సరిగా రావట్లేదా? అని ఎద్దేవా చేశారు. సమస్య మీ దగ్గర పెట్టుకొని తరచూ బీజేపీని విమర్శంచడం తగదని చెప్పారు.
వైద్యం అందక పేదల ప్రాణాలు పోతున్నయ్: రాకేశ్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
రాష్ట్రంలో సరైన వైద్యం పేదల ప్రాణాలు పోతున్నాయని బీజేపీ ఆర్మూర్ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోవడానికి పేద, మధ్య తరగతి ప్రజలు తమ ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బడ్జెట్ పై చర్చలో ఆయన మాట్లాడారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన సర్కారు విద్య, వైద్యానికి నిధులు తగ్గించడం సరికాదన్నారు. ఒక పేషెంట్ వైద్యానికి రూ.4 లక్షల బిల్లు అయితే.. అందులో కొంత తగ్గించాలని స్వయంగా మల్కాజ్గిరి ఎంపీ, తాను, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాల్చేసి చెప్పినా.. కేవలం రూ.25 వేలే తగ్గించారని తెలిపారు.
