
వర్ధన్నపేట, వెలుగు : ‘ఒక్కో ఊరికి 15 వైన్‌షాపులకు పర్మిషన్లు ఇస్తున్నరు. గ్రామాల్లో బెల్టుషాపులకు లెక్కే లేదు. యువత మద్యానికి బానిసై సచ్చిపోతున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్నక్సలైట్ల ఏజెండానే తన ఎజెండా అని అన్నడు. ఇప్పుడేం చేస్తున్నడు? కేసీఆర్‌పాలనలో జరుగుతున్న దారుణాలు మీ కండ్లకు కనవడుత లేవా? ’ అంటూ కవి అందెశ్రీ మావోయిస్టులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మావోయిస్టులు కండ్లు తెరువాలన్నారు. టీజేఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు దగ్గరున్న కల్యాణ లక్ష్మి గార్డెన్లో మంగళవారం తెలంగాణ బచావో సదస్సు నిర్వహించారు.
ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, ప్రొఫెసర్ వెంకటనారాయణ పాల్గొని మాట్లాడారు. అందెశ్రీ మాట్లాడుతూ తెలంగాణను చెరబట్టిన నైజామును
వెళ్లగొట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని మరో దోపిడీ దొంగ చేతిలో పెట్టామన్నారు. బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసై చనిపోయి, ఆడపడుచులు వితంతువులుగా మారుతుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా వారిలో చలనం ఎందుకు కలగడం లేదో తెలియడం లేదన్నారు. ఓటర్లు క్వార్టర్లకు అమ్ముడు పోకుండా షూటర్లుగా మారి అక్రమార్కుల భరతం పట్టాలన్నారు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారంతోనే రాష్ట్రంలో ప్రగతిని చూపిస్తున్నారని, పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఒక్కరూ బాగుపడలేదన్నారు. మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవం నిలబడేవరకు అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎవ్వరూ భయపడొద్దని, ఎందాకైనా తెగించి కొట్లాడుదామన్నారు.
పైసలు సంపాదించడానికే ఎమ్మెల్యేలైన్రు
బీఆర్ఎస్లో అందరూ పైసలు సంపాదించడానికే ఎమ్మెల్యేలయ్యారు తప్ప ప్రజా సేవ చేద్దామని కాదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ బచావో సదస్సులో వర్ధన్నపేట టీజేఎస్ అభ్యర్థిగా డాక్టర్ వడ్డేపల్లి విజయ్‌కుమార్‌ను ప్రకటించారు. కోదండరాం మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ప్రైవేట్వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని, బ్యాంకులు సాయం చేయకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. సభ పెట్టుకుంటామంటే నిర్భందాలు పెట్టడం ఈ సర్కారుకు అలవాటుగా మారిపోయిందన్నారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి 200రోజులు మాత్రమే జీవం ఉన్నదని, ఎమ్మెల్యేలు సీఎం కాళ్లు మొక్కుతూ నిజాంనాటి రోజులను గుర్తుకు తెస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుంటి రాంచందర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శలు బైరి రమేశ్, ధర్మార్జున్, షేక్ జావిద్, నాయకులు పిల్లి సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాజేశ్, పాల్గొన్నారు.