తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు

తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు

హైదరాబాద్: తెలంగాణ పూల సింగిడి.. ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. బతుకమ్మ ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని సోమవారం (సెప్టెంబర్ 29) హైదరాబాద్‎లోని సరూర్ నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగులు ఎత్తు, 11  అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. 

ఆకాశానంటే ఈ 63 అడుగుల మెగా బతుకమ్మ ‘అతిపెద్ద బతుకమ్మ’గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీంతో పాటు బతుకమ్మ మరో ఘనత దక్కించుకుంది. ఈ 63 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు. దీంతో ఒకేసారి ఎక్కువ మంది మహిళలు ఆడిపాడిన తెలంగాణ జానపద నృత్యంగా బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్ నమోదు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ఈ మేరకు ప్రకటన చేశారు. 

తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం పట్ల మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటామని అన్నారు. బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఆడబిడ్డలు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. 

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గల్లి నుంచి గ్లోబల్ వరకు ఏదైనా సాధిస్తామని మహిళలు నిరూపించారన్నారు. ఏ రంగంలోనైనా ముందుడుగు వేస్తామని అన్నారు. ఇంతగొప్ప కార్యక్రమం చేసిన సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మకు ప్రతిష్టాత్మక గిన్నిస్ రికార్డ్ కోసం రెండు నెలలుగా కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేసిన అందిరికి ఈ సందర్భంగా సీతక్క అభినందలు తెలియజేశారు.