- సర్కార్ ఆదేశాలు జారీ
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఏ నియోజకవర్గానికి చెందిన గురుకుల స్కూల్, కాలేజీని అదే నియోజకవర్గంలో కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 329 స్కూళ్లు, 294 జూనియర్, 33 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అద్దె భవనాల కొరత, ఇతర సమస్యల కారణంగా పలు గురుకులాలు కేటాయించిన నియోజకవర్గాలకు బదులుగా ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 గురుకులాలు ఇతర నియోజకవర్గాల్లో నడుస్తున్నాయి. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్‌కేసర్‌లో మూడు నియోజకవర్గాలకు చెందిన గురుకుల స్కూళ్లను ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అద్దె భవనాల లభ్యత లేకపోవడం, అద్దెలు అధికంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అనుకూలమైన అద్దె భవనాలను గుర్తించి గురుకులాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది.
త్వరలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ
తెలంగాణలో యాప్ ఆధారిత మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ అమలుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, పారదర్శక సేవలే లక్ష్యంగా సమగ్రమైన కొత్త మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకోసం సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ ఇప్పటికే అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, వాహన యజమానులు, ప్రతినిధులు, రవాణా ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ శాఖల ప్రతినిధుల భాగస్వామ్యంతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు తీసుకుందని వివరించారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, బీమా, డిజిటల్ మానిటరింగ్, ఛార్జీల్లో పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పర్యావరణ రహిత వాహనాల ప్రోత్సాహం వంటి కీలక అంశాలను ఈ కమిటీ పరిశీలించిందని తెలిపారు. ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించనుందని, ఆ తర్వాత ప్రభుత్వం పరిశీలించి అగ్రిగేటర్ పాలసీ అమలుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
