అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ వచ్చింది:కేసీఆర్

అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ వచ్చింది:కేసీఆర్

హైదరాబాద్: డా అంబేద్కర్  దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్దంగా సాధ్యమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారత దేశాన్ని  తీర్చిదిద్దేందుకు, బాబాసాహెబ్ అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనని కేసీఆర్ అన్నారు. దేశానికి అంబేద్కర్ అందించిన  సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను  అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని సీఎం గుర్తు చేసుకున్నారు. వేలకోట్ల రూపాయలను ఖర్చు  చేసి అనేక పథకాలను వినూత్న రీతిలో ప్రభుత్వం అమలు పరుస్తున్నదని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసి, సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో అమలు పరుస్తున్న ఆర్ధిక సమాజిక విధానాలలో బాబాసాహెబ్ ఆశయాలు ఇమిడివున్నాయని సిఎం తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక ప్రగతినిధి ( ఎస్సీ సబ్ ప్లాన్) చట్టం ఏర్పాటు చేశామన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ప్రైడ్  కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పే దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలందిస్తున్నదన్నారు. మార్కెట్ కమిటీల్లో కాంట్రాక్టు పనుల్లో దళితులకు రిజర్వేషన్లు  కల్పించామన్నారు.  ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు సాధిస్తున్న అద్భుత విజయాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గురుకులాలల్లో  నాణ్యమై విద్యతోపాటు పలు అనుబంధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వారికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తున్నదని వివరించారు. ప్రపంచంతో పోటీ పడుతూ  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దళిత గిరిజన బిడ్డలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతుండడాన్ని ప్రపంచం ప్రశంసిస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశీ విద్యా నిధి ద్వారా దళిత గిరిజన బిడ్డలకు ప్రభుత్వం విదేశీ విద్యనందిస్తున్నదని తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల రహిత సమాజానికి బాటలు వేసేందుకు ప్రభుత్వం  కృషి  చేస్తున్నదని ఈ సందర్బంగా సిఎం తెలిపారు.