ప్రభుత్వ ఖర్చుతో పార్టీ భజన.. బీఆర్ఎస్ వేడుకలుగా మారిన దశాబ్ది ఉత్సవాలు

ప్రభుత్వ ఖర్చుతో పార్టీ భజన.. బీఆర్ఎస్ వేడుకలుగా మారిన దశాబ్ది ఉత్సవాలు
  • ఉద్యమకారులు, అమరుల ప్రస్తావనే లేదు
  • తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం లేదు
  • ఎంతసేపూ సొంత డబ్బా కొట్టుకుంటున్న లీడర్లు
  • ప్రతిపక్షాలే టార్గెట్ గా మంత్రులు, ఎమ్మెల్యేల కామెంట్లు 

వెలుగు, నెట్​వర్క్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.. బీఆర్ఎస్​ వేడుకలుగా మారాయి. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్న వేడుకల్లో బీఆర్ఎస్ లీడర్లు పార్టీ భజన చేస్తున్నారు. సీఎం కేసీఆర్​పై పొగడ్తల వర్షం కురిపిస్తూ, తొమ్మిదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటూ గొప్పలు చెబుతున్నారు. బంగారు తెలంగాణ, బంగారు పాలమూరు, బంగారు ములుగు.. ఇలా మొత్తం బంగారు తున్కల ముచ్చట్లే చెప్తున్నారు. ప్రతిపక్షాలే టార్గెట్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని గురించి గానీ, రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల గురించి గానీ, ఊరూరా తిరిగి ఆడిపాడిన ఉద్యమకారుల గురించి గానీ మాటమాత్రమైనా మాట్లాడటం లేదు. అసలు అధికారికంగా జరుగుతున్న ఉత్సవాల్లో ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు, ప్రతిపక్ష నేతలకు, ప్రజా సంఘాలకు చోటే లేకుండా పోయింది. 

రూ.105 కోట్లతో వేడుకలు...  

తెలంగాణ అవతరణ వేడుకలను జూన్​2 నుంచి మూడు వారాల పాటు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణపై రోజువారీ షెడ్యూల్​ ప్రకటించి, అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. సంబురాల కోసం ఏకంగా రూ.105 కోట్లు కేటాయించింది. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో అధికారులతో పాటు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొంటున్నారు. ఎక్కడా ప్రతిపక్ష నేతలను, ప్రజాసంఘాల నాయకులను, ఉద్యమకారులను ఆహ్వానించడం లేదు. వేడుకల్లో అమరులు, ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటారని.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను గుర్తించి సన్మానిస్తారని అంతా భావించారు. కానీ ఎక్కడా అలా జరగడం లేదు. రైతు దినోత్సవం, విద్యుత్ విజయోత్సవం, పారిశ్రామిక ప్రగతి.. అంటూ ఒక్కో రంగంలో తామెంతో అభివృద్ధి చేశామంటూ ఒక్కో రోజు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. 

ప్రతిపక్షాలపై విమర్శలు.. 

అధికారికంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా అవతరణ వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. బుధవారం ములుగులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ నేతలు చేతగాని చేవలేనివాళ్లు, సన్నాసులంటూ కామెంట్లు చేశారు. ‘అభివృద్ధిని చూసి ఓర్వలేని సన్నాసోళ్లు.. ఎలక్షన్లు రాగానే ఎన్నో మాయమాటలతో ముందుకు వస్తున్నారు’ అని విమర్శలు గుప్పించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​నే గెలిపించాలని ఓపెన్​గానే కోరుతున్నారు. తాము చేసిందేమిటో చెప్పకుండా కాంగ్రెస్​, బీజేపీ మీద విమర్శలకే ప్రెయారిటీ ఇస్తున్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ లీడర్లు చేసిన కామెంట్లలో కొన్ని.. 

  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రం గాన్ని ప్రైవేటీకరించాలని చూస్తోంది. ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల జాబ్స్ ఔట్ అయితాయి. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే 7 గంటల పాటే కరెంట్ వస్తుంది. ఉమ్మడి ఏపీలో కరెంట్ కోసం రైతులు ఆందోళన చేస్తే.. అప్పటి సీఎం చంద్రబాబు బషీర్ బాగ్​లో గుర్రాలతో తొక్కించి, కాల్పులు జరిపించిండు.  

ఈనెల 5న మెదక్​లో జరిగిన విద్యుత్ ప్రగతి సభలో మంత్రి హరీశ్ రావు 

  • ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతున్నరు. ఇది చేశాం..అది చేశాం అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నరు. వాళ్ల కడుపులో మన్నువడ. కాంగ్రెస్ హయాంలో చెప్పులరిగేలా తిరిగినా పనులు కాలే.

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఈనెల 5న జరిగిన విద్యుత్​ సంబురాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

  • బండి సంజయ్, రేవంత్ రెడ్డి తమ సొంత గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలి. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని వారు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. బండి, రేవంత్​కి దమ్ముంటే నా సవాల్​ను స్వీకరించాలె.  

జనగామలో జరిగిన నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  

  • రాష్ట్రంలో ఉచితాలను బంద్ చెయ్యాలనేటోళ్లను తెలంగాణ ప్రజలు ఉరికిస్తరు. కాంగ్రెస్, బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయి. 

చేర్యాల మండలం ముస్త్యాలలో జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 

  •  అజయ్ అన్న మనుషులంటే ఆఫీసర్లు పో సుకోవాలి. ఏ సమస్యపై అయినా తహసీల్దార్, ఎస్సైని కలిస్తే వణుక్కుంట పని చేస్తరు. కేసీఆర్​ను అడ్డం పెట్టుకుని సంపాదించి బయటికొచ్చినోళ్లు ఏదో మాట్లాడుతున్నారు. నన్ను అసెంబ్లీ గేటు దాటనివ్వరంటా... 

ఈ నెల 3న ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన రైతు ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్

వివిధ వర్గాల నిరసన..

తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి వేదిక.. బతుకమ్మ, బోనాలు, తెలంగాణ ఆటపాటలతో ఇక్కడి సంస్కృతికి అద్దం పట్టింది. కానీ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్​ జెండాలు తప్ప మరేమీ కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేకతలకు, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులకు, కళాకారులకు, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం దక్కడం లేదు. ఒక్కదగ్గర కూడా రాష్ట్ర ఆకాంక్షల స్ఫూర్తి కనిపించడం లేదు. దీంతో సంబురాలపై వివిధ వర్గాల నుంచి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలకు కనీసం తమను ఆహ్వానించలేదని నిరసిస్తూ ఈ నెల 2న జగిత్యాల జిల్లా రాయికల్​లో కళాకారులు జోలె పట్టి భిక్షాటన చేశారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామస్తులు నీటి పండుగను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ‘‘మా గ్రామ చెరువు కబ్జాకు గురవుతోంది. చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని కంప్లయింట్ చేసినా పట్టించుకోని ఆఫీసర్లు.. నీటి పండుగ చేయడమేంటి?”అని గ్రామస్తులు మండిపడ్డారు. ఇంకా 40 శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని, రేయింబవళ్లు కుప్పల వద్దే కాపలా కాస్తున్నామని.. ఈ టైమ్ లో సంబురాలేంటని రైతులు మండిపడుతున్నారు. ఇక పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా సంబురాలు ఏంటని  సర్పంచులు పలుచోట్ల బహిరంగంగా తమ నిరసన తెలుపుతున్నారు.