
తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ తెలంగాణ చీప్ కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని.. అందుకే బీఆర్ఎస్ తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలకు ఒక ఒప్పందానికి వచ్చాయని ధ్వజమెత్తారు.
అవినీతి, కుటుంబ పాలన వల్లే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను ఓడించారు కానీ..కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. కాళేశ్వంపై విచారణ కోరుతూ.. కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు.. ఎలాంటి భూ పరీక్షలు చేయలేదని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోప్యంగా ఉంచుతుందని.. ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్ ను కాపాడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించలేదని.. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా లేదా.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.