ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు.. కొన్నింటిపై క్లారిటీ!

ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు.. కొన్నింటిపై క్లారిటీ!
  • పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు
  • మహబూబ్​నగర్ సీటుపై పీటముడి
  • ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు
  • సిట్టింగు స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే 
  • పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్​ను దింపే చాన్స్ 
  • జహీరాబాద్ నుంచి దిల్ రాజు పేరూ పరిశీలన 
  • ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్​ 

న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు: లోక్​సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా లోక్​సభ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా శనివారం ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు హాజరయ్యారు. 

రాష్ట్రంలోని నియోజకవర్గాలకు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించాక.. ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అధిష్ఠానానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందించినట్టు తెలుస్తున్నది. ఆ లిస్టుపై పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్​లో అధిష్ఠానం చర్చించనుంది. ఈ నెల 29న పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగును నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ రోజే లిస్ట్​పై చర్చించి అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. కోర్ కమిటీ మీటింగ్​లో కొన్ని స్థానాలపై దాదాపుగా క్లారిటీ వచ్చినా కొన్ని స్థానాలపై మాత్రం పీటముడి పడ్డట్టుగా సమాచారం.  

మహబూబ్ నగర్ పై పీటముడి 

కొన్ని స్థానాలపై క్లారిటీ వచ్చినా.. మరికొన్ని స్థానాల్లో పీటముడులు ఏర్పడడంతో పార్టీ హైకమాండ్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా మహబూబ్​నగర్ స్థానం విషయంలో ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ మల్లగుల్లాలు పడుతున్నట్టు చెప్తున్నారు. ఆ స్థానం నుంచి ఇద్దరు సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వారితో పాటు పార్టీ కోశాధికారి శాంతికుమార్ కూడా మహబూబ్​నగర్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆ స్థానాన్ని ఎవరికివ్వాలన్న దానిపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరూ ఆ స్థానం నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. అందుకే ఒకరికి మహబూబ్​నగర్ టికెట్ ఇస్తే ఇంకొకరిని మరో స్థానం నుంచి బరిలోకి దింపేలా హైకమాండ్ యోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆ సీటుపైకూడా ఇద్దరితో పార్టీ పెద్దలు చర్చించినట్టు, వారిద్దరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం.  

జహీరాబాద్ నుంచి దిల్ రాజు? 

జహీరాబాద్ లోక్​సభ స్థానం నుంచి సినీ నిర్మాత దిల్ రాజును బరిలోకి దింపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన్ను అక్కడి నుంచి బరిలోకి దింపితే పార్టీకి సినీ గ్లామర్ కలిసి వస్తుందన్న ఆశాభావంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. దిల్ రాజు ఓకే అంటే పార్టీ తరఫున టికెట్​ప్రకటించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇటు పెద్దపల్లి నుంచి గాయకుడు మిట్టపల్లి సురేందర్​ను దింపే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన్ను పార్టీ పెద్దలు సంప్రదించినట్టు సమాచారం. టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమేనని సురేందర్ చెప్పినట్టు సమాచారం. అయితే, హైకమాండ్ నిర్ణయం ఆధారంగానే ఆయా సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  

సిట్టింగ్ సీట్లు సిట్టింగులకే

రాష్ట్రంలో సిట్టింగ్ ఎంపీ స్థానాలను సిట్టింగులకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఇవి దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక, అన్ని పార్టీల్లోనూ హాట్​సీటుగా ఉన్న మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ను బీజేపీ బరిలోకి దింపనున్నట్లు తెలుస్తున్నది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్​కు టికెట్ కన్ఫమ్ అయినట్టేనని చెప్తున్నారు. 

2న రాష్ట్రానికి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. మార్చి 2న ఆయన హైదరాబాద్​కు రానున్నారు. ఆ రోజు నిర్వహించనున్న పార్టీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తున్నది. వాస్తవానికి ఈ నెల 24నే అమిత్ షా తెలంగాణ టూర్ ఉంటుందని భావించినా, అప్పుడు కుదరలేదు. ఈ నేపథ్యంలో షా టూర్ ను వచ్చే నెల 2కు ఖరారు చేశారు.