రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో విడతలవారీగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్

రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో విడతలవారీగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్
  •     ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో 15 నుంచి 1,220 స్కూళ్లలో షురూ 
  •     నవంబర్ నాటికి రాష్ట్రమంతా అమలుకు చర్యలు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ విడతల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో ఒకేసారి ప్రారంభించాలనుకున్నా.. సెంట్రలైజ్డ్ కిచెన్స్  కొరత కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నెల15న తొలి విడతను ప్రారంభించనుంది. మొదట గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, మరికొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని 1,220 స్కూళ్లలో స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారా సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందనుంది. 

తొలి విడతలో భాగంగా సెంట్రలైజ్డ్ కిచెన్ సౌకర్యం ఉన్న రెండు సంస్థలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేయాలంటే కేంద్రీకృత వంటశాలలు తప్పనిసరి. వీటి నిర్మాణానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. నవంబర్,  డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని బడులకు పథకాన్ని విస్తరించాలని విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కిచెన్ల నిర్మాణానికి సర్కారు టెండర్లను పిలిచింది. ఈ పనులు వేగంగా పూర్తి చేసి,  సాధ్యమైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు అల్పాహారం అందించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అప్పటివరకు విడతల వారీగా స్కూళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోనున్నారు.