ఇవాళ(జులై 17) కేబినెట్ భేటీ.. రైతులు, సాగునీటి ప్రాజెక్టులపైనే  ఫోకస్ 

ఇవాళ(జులై 17) కేబినెట్ భేటీ.. రైతులు, సాగునీటి ప్రాజెక్టులపైనే  ఫోకస్ 
  •     బనకచర్లపై సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో జల వివాదాలపై కేబినెట్ చర్చ!

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర రైతాంగ సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి వంటి పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, నీటి లభ్యత ఆధారంగా సాగునీటి సరఫరా వంటి అంశాలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. 


అదేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవన ఫేజ్-1 పనుల పురోగతిపై చర్చిస్తారు. ధరణి, భూ భారతిలో జరిగిన అక్రమాలపై సిట్ వేసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎల్‌‌నినో ప్రభావం, లోటు వర్షపాతం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ దృష్టి సారించనుంది. రైతాంగానికి నష్టం జరగకుండా కాపాడుకునేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహం, కంటింజెన్సీ ప్లాన్ అమలుపై చర్చలు జరపనుంది. జల వనరుల నిర్వహణతో పాటు పొరుగు రాష్ట్రాలతో నెలకొన్న జల వివాదాలపై కూడా ఈ భేటీలో విస్తృతంగా సమీక్షించనున్నారు. ఇటీవల గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, తదుపరి లీగల్ వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేయనుంది.

దీంతో పాటు కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల పరిధిలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు, ఇతర రాష్ట్రాలతో జరిపిన చర్చల సరళిని కేబినెట్ ముందు ఉంచనున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకునేలా కఠినమైన, పారదర్శకమైన సాగునీటి నిర్వహణ విధానాన్ని రూపొందించడంపై మంత్రివర్గం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో సాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలపై కూడా కేబినెట్ సమాలోచనలు చేయనుంది. ఢిల్లీ స్థాయిలో పెండింగ్‌‌లో ఉన్న కీలక ప్రతిపాదనలు, పరిపాలనాపరమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అజెండాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.