హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియేట్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడం, కోర్టులో కేసు పెండింగ్ ఉండడం, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని సర్కారు యోచిస్తోంది.
కేసు విచారణలో ఉన్నందున చట్ట ప్రకారం అధికారికంగా వెంటనే బీసీలకు రిజర్వేషన్ల అమలు వీలుకాకపోతే ఏం చేయాలనేదానిపై చర్చించనున్నారు. కాగా, మంత్రులందరి అభిప్రాయం, సూచనలకు అనుగుణంగా కూలంకుశంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనితోపాటు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకురానున్న చట్టానికి సంబంధించిన ముసాయిదాపై కేబినెట్ చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
ఇటీవల మృతి చెందిన ప్రజా కవి అందెశ్రీ పేరిట స్మృతి వనం ఏర్పాటుపైనా కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన కుమారుడికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం తెలుపనున్నారు. సాగునీటి పారుదల శాఖలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సవరించిన అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
