మే 4న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు,  పీఆర్సీ నివేదికపై చర్చించే చాన్స్

 మే 4న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు,  పీఆర్సీ నివేదికపై చర్చించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్​లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీ నివేదిక అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి, ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గాల ప్రతిపాదనలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో జరపాల్సిన చర్చలపై కూడా ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడం, టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు కొత్త ఆసరా పింఛన్ల మంజూరు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోనున్నారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కేకే, కోదండరాం కమిటీల సిఫార్సుల విధివిధానాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సాగునీటి రంగానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, సాంకేతిక మార్పులపై చర్చించనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా  వారి సమస్యలు,  సంక్షేమ పథకాల అమలుపై కూడా ఈ కేబినెట్​లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేసేందుకు అవసరమైన ప్రణాళికతో పాటు, పెండింగ్ డీఏలపై చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై అధ్యయన కమిటీ నివేదికను పరిశీలించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.