అధికారికంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

అధికారికంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
  • ఫూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్​బండ్​పై  ఏర్పాటు చేస్తున్నం: మంత్రి వాకిటి శ్రీహరి 

బషీర్​బాగ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రి బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర క్రీడలు, యువజన, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సావిత్రి బాయి ఫూలే ఫౌండేషన్, సావిత్రి బాబు విమెన్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమె195వ జయంతి వేడుకలను శనివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

 జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మణి మంజరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 

సావిత్రిబాయి ఫూలేను దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తించి గౌరవిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌‌‌‌కు ఫూలే భవన్ గా నామకరణం చేసినట్టు గుర్తు చేశారు. ఫూలే దంపతుల విగ్రహాలను అన్ని మండల, జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని ప్రశంసించారు. దేశంలో తొలిసారిగా మహిళలకు చదువుకునే అవకాశం కల్పించిన ఘనత ఫూలే దంపతులదేనని పేర్కొన్నారు. ఈ భూప్రపంచం ఉన్నంత కాలం ఫూలే దంపతుల చరిత్ర ఉంటుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ చైతన్యం పొందాలన్నారు.