V6 News

నెలాఖరుకల్లా ఓటర్ల మ్యాపింగ్‌‌ పూర్తి చేయాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం

నెలాఖరుకల్లా ఓటర్ల మ్యాపింగ్‌‌ పూర్తి చేయాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్​ఇంటెన్సివ్ రివిజన్ (సర్​) ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాలు, వలస జనాభా అధికంగా ఉండే జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రత్యేక వ్యూహంతో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

40 ఏళ్లలోపు వయస్సున్న మహిళా ఓటర్లను వారి తల్లిదండ్రులతో మ్యాపింగ్ చేయాలని, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ అసోసియేషన్లు, మురికివాడల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు స్వచ్ఛందంగా తమ వివరాలను మ్యాపింగ్ చేయించుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వీప్  కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను సుదర్శన్ రెడ్డి కోరారు. సమావేశంలో అదనపు సీఈవో డాక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.