- ప్రతివారం మిల్లుల్లో తనిఖీలు
- ర్యాండమైజేషన్ పద్ధతిలో అధికారుల కేటాయింపు
- ధాన్యం రాక నుంచి బియ్యం డెలివరీ వరకు పర్యవేక్షణ
- అధికారుల పనితీరుపై కూడా నిఘా.. డిఫాల్ట్ మిల్లర్లపై స్పెషల్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రైస్ మిల్లుల్లో జరిగే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అక్రమాలు, అవకతవకలకు బ్రేక్ వేయడానికి సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ సరికొత్త డిజిటల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, బియ్యం డెలివరీలు, పెండింగ్ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 'ఫిజికల్ వెరిఫికేషన్' (పీవీ) యాప్‌ను ప్రవేశపెట్టింది.
ఈ విధానం రావడంతో స్టాక్ మాయం చేయడం, లెక్కల్లో తేడాలు చూపించడం వంటి గోల్‌మాల్‌కు అవకాశం తగ్గనుంది. ఈ పీవీ యాప్ ద్వారా ప్రతీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఏ ఆఫీసర్ ఏ మిల్లుకు వెళ్లాలనేది ముందుగానే డిసైడ్ చేయకుండా.. ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయిస్తారు. తనిఖీకి వెళ్లే అధికారికి 12 గంటల ముందు లేదా ఒక్క రోజు ముందే ఎస్‌ఎంఎస్ ద్వారా మిల్లు వివరాలు వస్తాయి. దీంతో ముందే మిల్లుల్లో స్టాక్ మార్చడం, రికార్డులు సర్దుబాటు చేసే చాన్స్ ఉండదని భావిస్తున్నారు.
ధాన్యం నుంచి బియ్యం వరకు ప్రతీ లెక్క..
ఒక మిల్లుకు ఏ సీజన్‌లో ఎంత ధాన్యం కేటాయించారు? ఎంత మిల్లింగ్ అయింది? ప్రభుత్వానికి ఎంత బియ్యం అందించారు? ఎంత ఎంత సీఎంఆర్ పెండింగ్ ఉంది? అనే పూర్తి వివరాలు ఈ యాప్‌లోనే ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు మిల్లును చెక్ చేసినప్పుడు.. యాప్‌లోని వివరాలను అక్కడి ఫిజికల్ స్టాక్‌తో సరిచూస్తారు. ఆన్‌లైన్ రికార్డులకు, వాస్తవ నిల్వలకు తేడా ఉంటే వెంటనే నమోదు చేసి, అవసరమైతే పంచనామా నిర్వహించి రిపోర్ట్‌ను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా తనిఖీలు ఎప్పుడొస్తాయనే టెన్షన్ లేకుండా, ప్రతీ దశలోనూ డిజిటల్ నిఘా ఉంటుంది.
స్టాక్ మాయానికి అడ్డుకట్ట
గతంలో రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల రికార్డులను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి వచ్చేది. అయితే తనిఖీ ఎప్పుడు జరుగుతుందో ముందుగానే తెలిసేది కాబట్టి స్టాక్ విషయంలో మార్పులు చేసే చాన్స్ఉండేది. పీవీ యాప్‌లో ర్యాండమైజేషన్ విధానం అమలు చేయడం, తనిఖీకి కొద్దిసమయం ముందు మాత్రమే అధికారికి సమాచారం ఇవ్వడం వల్ల ఈ అవకాశాన్ని తగ్గించనున్నారు. మిల్లుకు వచ్చిన ధాన్యం పరిమాణం, మిల్లింగ్ అయిన ధాన్యం, సిద్ధమైన బియ్యం, ప్రభుత్వానికి పంపిన సీఎంఆర్, ఇంకా మిల్లులో ఉండాల్సిన స్టాక్.. ఇలా ప్రతి దశలోనూ లెక్కలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో స్టాక్ మాయం చేసినా, లెక్కల్లో తేడాలు ఉన్నా గుర్తించే అవకాశం ఉంటుంది.
అధికారుల మీద కూడా నిఘా..
ఈ యాప్ కేవలం మిల్లర్లనే కాకుండా, తనిఖీ చేసే ఆఫీసర్ల పనితీరునూ పర్యవేక్షిస్తుంది. క్షేత్రస్థాయి ఆఫీసర్ నమోదు చేసిన వివరాలను ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్లు, హెడ్ ఆఫీస్ టీమ్స్ మళ్లీ క్రాస్ చెక్ చేస్తాయి. ఒకవేళ రిపోర్ట్స్‌లో తేడాలు వస్తే సంబంధిత ఆఫీసర్ల మీదా
చర్యలు తీసుకుంటారు.
డిఫాల్ట్ మిల్లర్లపై స్పెషల్ ఫోకస్..
గత సీజన్లలో సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో ఫెయిల్ అయిన డిఫాల్ట్ మిల్లర్ల వివరాలను కూడా ఈ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పెండింగ్ స్టాక్, బకాయిల వివరాలు సీజన్ల వారీగా ఉండటంతో రికవరీని వేగవంతం చేయనున్నారు. మొత్తంగా ఈ డిజిటల్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తే మిల్లుల్లో అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
డిజిటల్ నిఘాతో పారదర్శకత
మొత్తంగా పీవీ యాప్ ద్వారా సీఎంఆర్ వ్యవస్థలో ధాన్యం కేటాయింపు నుంచి మిల్లింగ్, బియ్యం నిల్వ, డెలివరీ వరకు ప్రతి దశను డిజిటల్‌గా పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. వారానికోసారి ఆకస్మిక తనిఖీలు, ర్యాండమైజేషన్, భౌతిక నిల్వలతో ఆన్‌లైన్ రికార్డుల సరిపోలిక, ఉన్నతాధికారుల పర్యవేక్షణ వంటి చర్యలు అమలులోకి రావడంతో మిల్లుల్లో స్టాక్ మాయం చేయడం, లెక్కల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే క్షేత్రస్థాయి తనిఖీలు, డిజిటల్ రికార్డుల నమోదు, తదుపరి చర్యలు క్రమబద్ధంగా కొనసాగాల్సి ఉంటుంది.
