కేసీఆర్ నాతో పాదయాత్ర చెయ్..నీకు షూ గిఫ్ట్: షర్మిల

కేసీఆర్ నాతో పాదయాత్ర చెయ్..నీకు షూ గిఫ్ట్: షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ కు స్పెషల్ గిఫ్ట్ పంపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలంటూ షూను బహుమతిగా పంపారు. కేసీఆర్ తనతో కలిసి పాదయాత్ర చేసేందుకు షూ బాక్స్ గిఫ్ట్ గా పంపుతున్నట్లు షర్మిల స్పష్టం చేశారు.. తన పాలన అద్భుతమంటున్న కేసీఆర్ తనతో ఒక్కరోజు పాదయాత్ర చేస్తే ప్రజాసమస్యలు తెలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఒకవేళ సమస్యలున్నట్లు తేలితే కేసీఆర్ రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు నాయకులే కలిసే పరిస్థితి లేదని షర్మిల వాపోయారు.  

గవర్నర్ తమిళి సైతో భేటీ కావాలనుకున్నామని, అయితే.. పాదయాత్రకు ఆలస్యమవుతుండటంతో కలువలేకపోయినట్లు షర్మిల చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 

వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని శంకరం తండా గ్రామం నుండి మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సాయంత్రం శంకరం తండా, లింగగిరి, సూరిపల్లి తండాల మీదుగా నెక్కొండ మండలం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. షర్మిల ఈ రాత్రికి నెక్కొండలో బస చేయనున్నారు.