రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ ఇలా..

రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ ఇలా..
  • 27 రోజుల్లో మూడు విడతల్లో కార్యక్రమం
  • పంద్రాగస్టులోగా రూ.2లక్షలు మాఫీ చేస్తామన్న సీఎం
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు
  • కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి మాఫీ సమస్యల పరిష్కారం

హైదరాబాద్, వెలుగు: రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంట రుణాలను మాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేసింది. జులై 18న ప్రారంభించి కేవలం 27 రోజుల వ్యవధిలోనే రూ.2 లక్షల వరకున్న క్రాప్​లోన్లు మాఫీ చేయడం గమనార్హం. మొదటి రెండు దశల్లో కలిపి మొత్తం రూ.12,224.98 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగా.. తాజాగా మూడో దశలో, ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు రుణాల మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తూ.. 4,46,832 మంది రైతుల లోన్ ఖాతాలో రూ.5,644.24 కోట్ల నిధులను జమ చేశారు. ఇలా మూడు దశల్లో మొత్తం 22,22,067 మంది రైతుల క్రాప్​లోన్ అకౌంట్​లలో రూ.17,869.22 కోట్లు జమ చేయడం ద్వారా రూ.2 లక్షల వరకున్న పంట రుణాల మాఫీ జరిగింది. 

రుణమాఫీ విషయంలో టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ విషయంపై నెల రోజుల పాటు స్పెషల్​క్యాంపెయిన్ నిర్వహించనుంది. గురువారం పంద్రాగస్టు సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి లాంఛనంగా బటన్ నొక్కి అధికారికంగా నిధులు విడుదల చేశారు. దీంతో నేరుగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమయ్యాయి. రైతులకు 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నిలుపుకున్నారు.

రూ.2లక్షల వరకు క్రాప్​లోన్లు మాఫీ అయింది ఇలా

రుణమాఫీ కార్యక్రమం జులై 18న ప్రారంభమైంది. మొదటి విడతలో లక్ష వరకు పంట రుణాలున్న 11,34,412 మంది రైతుల ఖాతాలకు రూ. 6,034.96 కోట్లు జమ చేశారు. రెండో విడతలో లక్షన్నర వరకు  లోన్లు ఉన్న 6,40,823 మంది రైతుల అకౌంట్లలో రూ.6,190.01 కోట్ల నిధులు జమ చేశారు. ఇలా రెండో విడత ముగిసే సమయానికి మొత్తం 17,75,235 మంది రైతుల ఖాతాల్లో రూ.12,224.98 కోట్ల మాఫీ జరిగింది. తాజాగా గురువారం రోజున 4,46,832 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5,644.24 కోట్ల నిధులను జమ చేశారు. ఇలా మొత్తంగా 22,22,067 మంది రైతుల పంట రుణాలు మాఫీ అయ్యాయి.

నెల రోజుల పాటు స్పెషల్ క్యాంపెయిన్

రాష్ట్రవ్యాప్తంగా వివిధ టెక్నికల్ ప్రాబ్లమ్స్​తో క్రాప్​లోన్లు మాఫీ కాలేదు. ఇలాంటి రైతుల కోసం శుక్రవారం నుంచి నెలపాటు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి వారిలో అర్హులందరికీ రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే మండలాల వారిగా రైతుల ఫిర్యాదులు తీసుకుంటున్నరు. ఇప్పుడు కలెక్టరేట్​లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ రుణమాఫీ టెక్నికల్ సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు సన్నద్ధమైంది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యక్ష్యంగా రైతుల వద్దకు వెళ్లి నిర్ధారించనున్నారు.