రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు

రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హడావిడి నడుస్తుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించింది పార్టీ. పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో హైదరాబాద్ సిటీలోని ఓ హోటల్ లో సమావేశం అయిన ఎమ్మెల్యేలు.. సీఎల్పీ ఆదేశాలకు అనుగుణంగా సీఎం, డిప్యూటీ సీఎంలను ఎన్నుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్లనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇందు కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. 

సీఎల్పీలో సీఎం, డిప్యూటీ సీఎంల ఎన్నిక తర్వాత.. నేరుగా గవర్నర్ రాజ్ భవన్ వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మొత్తం వ్యవహారాన్ని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. గచ్చిబౌలిలోని హోటల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ నేరుగా రాజ్ భవన్ వెళ్లనున్నారు. అక్కడ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

ప్రమాణ స్వీకారం 2023, డిసెంబర్ 4వ తేదీనే ఉంటుందని ఇప్పటికే రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చింది పార్టీ. దీంతో రాజ్ భవన్ కు కుర్చీలు, టేబుళ్లు, ఇతర ఫర్నిచర్ సామాగ్రిని తరలిస్తున్నారు అధికారులు. మొదటగా డిసెంబర్ 9వ తేదీ ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.. పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యతో.. యాక్షన్ ప్లాన్ మార్చుకున్నది. దీనికితోడు నార్త్ ఇండియాలోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవటంతో.. తెలంగాణలో గెలిచిన సీట్లను పరిశీలించిన తర్వాత.. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రమాణ స్వీకారానికి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్.

ఈ క్రమంలోనే గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి.