- జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై కూడా కొనసాగిన చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం దాదాపు ఖరారైంది. సోమవారం అసెంబ్లీ హాల్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మీటింగులో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చిన ద్వితీయ శ్రేణి నాయకులకు, సామాజిక సమీకరణాల ఆధారంగా సముచిత స్థానం కల్పించేలా తుది జాబితాపై చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే ఖరారైన పేర్లను ఏఐసీసీ అగ్రనేతల ఆమోదం కోసం పంపి, వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా అసంతృప్తికి తావులేకుండా నియామకాలు ఉండాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాగా, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వీ ఇంట్లో శుభకార్యం అటెండ్ కావడం కోసం సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది.
పార్టీ తాజా పరిస్థితులపై చర్చ...
పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి, జీవన్ రెడ్డి లాంటి నేతలు దూరం కాకుండా చూడటం కోసం తీసుకోవాల్సిన చర్యలపై శ్రీధర్ బాబు, పొంగులేటిలతో సీఎం మాట్లాడారు. ‘‘జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు. రాజకీయంగా ఆయన వల్ల నేను ఎంతో లబ్ధి పొందాను. పార్టీలో ఇబ్బందులు రావడం సహజం.
కానీ ఆయన లాంటి సీనియర్ నేతను వదులుకోం’’ అని మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులం, ఒక ఎమ్మెల్యే వెళ్లి ఆయనతో మాట్లాడి పార్టీని వీడొద్దని కోరినట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు, జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
