తెలంగాణ కాంగ్రెస్​ సీనియర్ల పంచాయితీ..రంగంలోకి డిగ్గీ రాజా

తెలంగాణ కాంగ్రెస్​ సీనియర్ల పంచాయితీ..రంగంలోకి డిగ్గీ రాజా

హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిణామాలు హాట్ హాట్ గా మారాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కొందరు సీనియర్లు బహిరంగంగా అసమ్మతి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్​ పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు మొన్న జరిగిన భేటీలో ఒక్క తాటిపైకి వచ్చి పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా గళం విప్పడాన్ని పార్టీ పెద్దలు సీరియస్‌‌గా తీసుకున్నట్లు సమాచారం. 

రాష్ట్రంలో సీనియర్ల అసమ్మతిపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ అడ్వైజర్ బాధ్యతలు ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఈయన గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులందరితోనూ దిగ్విజయ్ కు పరిచయాలు, మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరదించే బాధ్యతలను కూడా హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కే అప్పగించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తెరదించేందుకు దిగ్విజయ్ సింగ్  ప్రయత్నించనున్నారు. రాష్ట్ర పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన దిగ్విజయ్ సింగ్ మరోసారి రంగంలోకి దిగడంతో ఇవాళ సాయంత్రం సీనియర్ల భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని అసమ్మతి నేత మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.