పేద‌ల ‘లాక్‌డౌన్‌’ క‌రెంటు బిల్లులు ప్ర‌భుత్వ‌మే భ‌రించాలి: ఉత్త‌మ్

పేద‌ల ‘లాక్‌డౌన్‌’ క‌రెంటు బిల్లులు ప్ర‌భుత్వ‌మే భ‌రించాలి: ఉత్త‌మ్

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌చ్చిన పేద‌ల క‌రెంటు బిల్లుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లాక్ డౌన్ టైమ్‌లో వ‌చ్చిన‌ పేద‌లు, చిరు వ్యాపారుల క‌రెంటు బిల్లుల‌ను మాఫీ చేయాల‌ని కోరారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఉపాధి లేక‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్న స‌మ‌యంలో కేసీఆర్ ప్రభుత్వం కరెంట్ బిల్లులను మూడింతలు చేసిందని, వారిపై భారం మోపింద‌ని అన్నారు. ఇష్టానుసారం క‌రెంటు బిల్లులు వేశార‌ని, స్లాబ్‌ల‌ను మించి బిల్లులు వ‌చ్చాయ‌ని అన్నారు. క‌రోనా లాక్ డౌన్‌తో కష్టాల్లో ఉన్న ప్రజలు ఆ కరెంట్ బిల్లులను ఎలా కట్ట‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు ఉత్త‌మ్. ఈ ర‌కంగా భారీగా క‌రెంటు  బిల్లులు వేసి, క‌ట్ట‌మ‌న‌డం దుర్మార్గ‌మ‌ని అన్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో చిన్న వ్యాపారుల‌కు పెద్ద‌గా వ్యాపారం లేద‌ని, వారి క‌రెంట్ బిల్లుల‌ను కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు.