బీసీ లీడర్ల చలో ఢిల్లీ..ఇవాళ్టి నుంచి మూడు రోజులు నిరసనలు

బీసీ లీడర్ల చలో ఢిల్లీ..ఇవాళ్టి నుంచి మూడు రోజులు నిరసనలు
  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ​ కార్యాచరణ
  • నేడు పార్లమెంట్​లో కాంగ్రెస్​ ఎంపీల వాయిదా తీర్మానం
  • రేపు జంతర్ ​మంతర్​ దగ్గర ధర్నా
  • 7న  రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేత
  • చర్లపల్లి నుంచి 1500 మందితో బయల్దేరిన ప్రత్యేక రైలు
  • వారి వెంట నాగ్‌‌పూర్ వరకు వెళ్లిన పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ 
  • ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​, మంత్రులు పొన్నం, వాకిటి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరుబాటకు రెడీ అయింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులతోపాటు, పంచాయతీ రాజ్​ చట్ట సవరణకు తెచ్చిన ఆర్డినెన్స్​ బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉండటంతో.. వాటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం నుంచి మూడు రోజులపాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపనుంది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని గత నెల 28న జరిగిన కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బీసీ నేతలు సోమవారం ఢిల్లీకి పయనమ్యారు. 

మూడురోజులు ఇలా..!

పార్లమెంట్​సమావేశాలు జరుగుతున్నందున బీసీ బిల్లుల ఆమోదం కోసం మంగళవారం పార్లమెంట్ లో కాంగ్రెస్​ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. 6న ప్రజా ప్రతినిధులందరితో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడ్తారు. 7న సీఎం,  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం వినతి పత్రం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ క్రమంలోనే  సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో వందలాది కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. సుమారు 1,500 మంది ప్రత్యేక రైలులో హస్తిన బాటపట్టారు. వారి వెంట కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ నాగ్‌‌‌‌పూర్ వరకు వెళ్లారు. ఇదే రైలులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్,  మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆలేరు వరకు వెళ్లి నాయకులు, కార్యకర్తలను ఢిల్లీకి సాగనంపారు. అనంతరం పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పీసీసీ కార్యవర్గంలోని ముఖ్య నేతల్లో కొందరు సోమవారం రాత్రి విమానాల్లో ఢిల్లీ చేరుకోగా.. మరికొందరు మంగళవారం ఉదయం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

పార్టీలకతీతంగా ఏకం కావాలి: మంత్రి పొన్నం ​

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పార్టీలకతీతంగా ఆనాడు అందరూ ఏకమై ఉద్యమించినట్లే బీసీ నేతలంతా పోరాడి బీసీ బిల్లులను ఆమోదింపజేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. బీసీ బిల్లుల నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలో అని, కాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్​లో దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ బిల్లుల విషయంలో కవితకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా.. తన దీక్షను ఢిల్లీకి మార్చాలని ఆయన సూచించారు. ‘‘ప్రతి బీసీ బిడ్డ ఏ పార్టీ అని  చూడకుండా..  వారి ముందు బీసీ బిల్లుల ఆమోదం అనేది ఒక్కటే గుర్తుకురావాలి. దీనికోసం మరో తెలంగాణ ఉద్యమం సాగాలి. బీజేపీ నేతలు కూడా కలిసి రావాలి” అని కోరారు.