- గైర్హాజరైన మజ్లిస్ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్
హైదరాబాద్, వెలుగు: చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నలు అడిగిన కొందరు సభ్యులు సభకు హాజరు కాకపోయినా, మంత్రులు ఆయా అంశాలపై వివరణనిచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం పెరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభలో ప్రస్తావించగా, ఎమ్మెల్సీలకు కూడా ఇందిరమ్మ ఇండ్లలో కోటా కేటాయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. మైనారిటీ బాలికల కోసం ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని, గుర్తింపు లేని స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలను కలపొద్దని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ సభ్యులు ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి పలు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఒక దశలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారపక్షం కేటాయించిన సీటు వద్ద నుంచి మాట్లాడే ప్రయత్నం చేయగా.. "అది డిప్యూటీ సీఎం సీటు, మీరు మీ స్థానం నుంచి మాట్లాడండి" అంటూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సరదాగా సెటైర్ వేశారు. మైనార్టీల సమస్యలను మజ్లిస్ సభ్యుడు ఎఫెండి సభలో ప్రస్తావించారు. మరోవైపు, మజ్లిస్ పార్టీకి చెందిన బహిష్కృత ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ మండలి సమావేశానికి గైర్హాజరయ్యారు.
