గ్రేస్ మార్కులు హక్కు కాదు ఎంసీఐ కొత్త రూల్స్‌‌‌‌ కరెక్టే

గ్రేస్ మార్కులు హక్కు కాదు ఎంసీఐ కొత్త రూల్స్‌‌‌‌ కరెక్టే

హైదరాబాద్, వెలుగు:  పాత రూల్స్‌‌‌‌ ప్రకారం తమకు గ్రేస్‌‌‌‌ మార్కులు ఇవ్వాలంటూ పలువురు స్టూడెంట్లు దాఖలు చేసిన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. గ్రేస్‌‌‌‌ మార్కులు పొందడం విద్యార్థుల హక్కు ఏమీ కాదని తేల్చి చెప్పింది. గ్రేస్‌‌‌‌ మార్కులు ఏమీ చట్టబద్ధ, ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది. ఎంసీఐ రూల్స్‌‌‌‌ అమల్లోకి వచ్చాకే పరీక్షల నిర్వహణ జరిగిందని, పాత రూల్స్‌‌‌‌ ప్రకారం గ్రేస్‌‌‌‌ మార్కులు కలపాలని కోరే హక్కు విద్యార్థులకు లేదని తెలిపింది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల విజ్ఞప్తిని ఎంసీఐ, యూనివర్సిటీలు పరిశీలించాలని సూచన చేసింది గ్రేస్‌‌‌‌ మార్కులను తొలగిస్తూ ఎంసీఐ రూపొందించిన రూల్స్‌‌‌‌ను సవాల్‌‌‌‌ చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన ఎనిమిది పిటిషన్లను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆలోక్‌‌‌‌ ఆరాధే, జస్టిస్‌‌‌‌ జె.అనిల్‌‌‌‌ కుమార్​తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ బుధవారం విచారించి ఆదేశాలు జారీ చేసింది.

2022లో నీట్‌‌‌‌ పరీక్షలు రాసి 2022–23లో ఎంబీబీఎస్‌‌‌‌ కోర్సుల్లో చేరారు. 2023 ఆగస్టు 1న పాత రూల్స్ స్థానంలో ఎంసీఐ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. పాత రూల్స్ ​ప్రకారం విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఒకదానిలో ఫెయిల్‌‌‌‌ అయినట్లయితే 5 మార్కులను కలిపే (గ్రేస్‌‌‌‌ మార్కులు) అధికారం యూనివర్సిటీకి ఉండేది. పాత రూల్స్ కింద పరీక్షలు రాశామని, మార్కుల జాబితాలో కూడా పాత నిబంధనల మేరకే ఉందని, కొత్త రూల్స్ గతానికి వర్తింపజేయడం చెల్లదని, దీనివల్ల తాము నష్టపోతున్నామని పిటిషనర్ల వాదన. 2023 ఆగస్టులో నిబంధనలు అమల్లోకి వచ్చాయని, దాని తరువాత నవంబరులో పరీక్షలు జరిగాయని అందువల్ల విద్యార్థులు ప్రత్యేక హక్కులు కోరడానికి వీల్లేదని ఎంసీఐ చెప్పింది. వీటిపై న్యాయసమీక్షకు పరిమితులు ఉన్నాయంది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు.. వెద్యవిద్యలో ఉన్నత విద్యా ప్రమాణాల నిమిత్తం నేషనల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేసింది. ఈ క్రమంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిందని, ఈ విధమైన అధికారం సెక్షన్‌‌‌‌ 10, 24, 25, 57 ప్రకారం ఎంసీఐకి ఉందని తీర్పులో పేర్కొంది. విద్యాప్రమాణాలను మెరుగుపరచే అధికారం బోర్డుకు ఉందని వెల్లడించింది. గ్రేస్‌‌‌‌ మార్కులు కోరడం ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ నిబంధనలకు గానీ సంబంధం లేదని చెప్పింది. కొత్త రూల్స్​తీసుకువచ్చినపుడు న్యాయసమీక్ష చేయవచ్చని. ఇక్కడ ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చింది. 

అంతేకాకుండా రూల్స్‌‌‌‌ మార్చబోమన్న హామీని ముందుగా ఇవ్వలేదని చెప్పింది. విద్యార్థులు ఎంబీబీఎస్‌‌‌‌ కోర్సులో చేరే ముందు కోర్సు పూర్తిచేసి బయటికి వెళ్లేదాకా నిబంధనల మార్పు ఉండదన్న హామీ లేదని పిటిషనర్లు గుర్తుంచుకోవాలని హితవు చెప్పింది. గ్రేస్‌‌‌‌ మార్కులు చట్టబద్ధమైన, రాజ్యాంగ హక్కులేమీ కాదని పేర్కొంది నిబంధనలు 2023 ఆగస్టులో అమల్లోకి వచ్చాయని పరీక్షలు నవంబరులో జరిగినందున వీటిని గతానికి వర్తింపజేశారని చెప్పడం సబబుకాదని చెప్పింది.  మార్కుల జాబితాలో పాత నిబంధనలను ప్రస్తావించడం పొరపాటుగా జరిగి ఉందని అభిప్రాయపడింది. గ్రేస్‌‌‌‌ మార్కులను తొలగిస్తూ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు సమర్థనీయమేనని తీర్పు చెప్పింది. అయితే, విద్యార్థుల వినతులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవచ్చునని తెలిపింది. పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.