- ఆడిట్ రిపోర్టులను దాచిపెడుతున్న మేనేజ్మెంట్లు
- రాష్ట్రంలోని 13,245 స్కూళ్లల్లో..
- లెక్కలిచ్చింది 16 మాత్రమే
- ఫీజుల దందాను దాచేందుకే
- ఆడిట్ రిపోర్టులకు వెనుకంజ
- లెక్కలివ్వని స్కూళ్లకు షోకాజ్ నోటీసులు
- ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్నాయి. ఫీజుల రూపంలో పేరెంట్స్ నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నా.. ఆదాయ, వ్యయాల వివరాలు ఇవ్వమంటే మాత్రం నీళ్లు నములుతున్నాయి. ఏటా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) తో ధ్రువీకరించిన ఆడిట్ రిపోర్టులను విద్యాశాఖకు సమర్పించాలన్న నిబంధనను బేఖాతరు చేస్తున్నాయి. తాము చేస్తున్న ఫీజుల దందాను దాచిపెట్టేందుకే ఈ రిపోర్టులు ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్లు వెనుకంజ వేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైఖరిపై విద్యాశాఖ సీరియస్ అయింది. లెక్కలు ఇవ్వని స్కూళ్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.
అసలు గుట్టు బయటపడుతుందనే..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,245 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా.. వాటిలో పదో తరగతి వరకు 36 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీటిలో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఏటా రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు పేరెంట్స్ నుంచి గుంజుతున్నాయి. ముఖ్యంగా రూ. లక్షకు పైగా ఫీజులు వసూలు చేసే బడులే ఎక్కువగా ఉన్నాయి.
జీవో నంబర్ 1 ప్రకారం.. స్టూడెంట్స్ నుంచి వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం టీచర్లు, ఇతర సిబ్బంది జీతాలకే ఖర్చు చేయాలి. కానీ, ఏ ఒక్క స్కూల్ కూడా దీన్ని పాటించడం లేదు. దాదాపు 10 వేలకు పైగా బడుల్లో ఫ్యాకల్టీకి కేవలం రూ.10 వేల నుంచి రూ.30 వేల లోపే జీతాలిస్తూ.. బయటకు మాత్రం భారీగా ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నాయి. అలాగే 15 శాతం సిబ్బంది సంక్షేమం (పింఛన్, పీఎఫ్, గ్రాట్యూటీ), మరో 15 శాతం స్కూల్ డెవలప్‌మెంట్, ఇంకో 15 శాతం నిర్వహణ (అద్దె, కరెంట్, స్టేషనరీ) ఖర్చులకు పోను.. మిగిలిన 5 శాతం మాత్రమే మేనేజ్‌మెంట్ వ్యక్తిగత ఆదాయంగా తీసుకోవాలి.
కానీ ఈ నిబంధనలను ఎక్కడా అమలు చేయడం లేదు. ఇక 2023--–24, 2024--–25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాల ఆడిట్ స్టేట్‌మెంట్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గతంలోనే ఆదేశించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అడ్డగోలు ఫీజులు, టీచర్లకు ఇస్తున్న అరకొర వేతనాలు, భారీ లాభాలు బయటపడతాయన్న భయంతోనే మేనేజ్‌మెంట్లు రిపోర్టులను దాచిపెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇచ్చింది 16 స్కూళ్లే..
రాష్ట్రంలో 13,245 స్కూళ్లు ఉంటే.. కేవలం 16 బడులు మాత్రమే తమ ఆడిట్ లెక్కలను విద్యాశాఖకు సమర్పించాయి. కొంత టైమ్ కావాలని కొన్ని మేనేజ్మెంట్లు అడిగితే.. గత నెల 30 వరకూ వివరాలు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గడువు ఇచ్చారు. కానీ మేనేజ్మెంట్లు మాత్రం వివరాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను స్కూల్ పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని ఆదేశించినా.. పెద్దగా పట్టించుకోలేదు.
కేవలం 8 జిల్లాల నుంచి 16 స్కూళ్లు మాత్రమే ఇచ్చాయి. రాష్ట్రంలోనే సగం స్కూళ్లున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల నుంచి కేవలం ఒకే ఒక్క స్కూల్ ఆడిట్‌రిపోర్ట్ ఇవ్వడం గమనార్హం. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సీరియస్ అయ్యారు. లెక్కలు ఇవ్వని 13,229 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆర్జేడీలు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
వెబ్‌సైట్‌లో ఫీజుల వివరాలు పెట్టాల్సిందే..
ప్రైవేటు స్కూళ్లు ఆడిట్ లెక్కలతో పాటు ఫీజుల వివరాలను కూడా బహిర్గతం చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2026–--27 విద్యా సంవత్సరానికి సంబంధించి క్లాసుల వారీగా వసూలు చేసే ఫీజుల వివరాలను అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌తో పాటు స్కూల్ నోటీస్ బోర్డులో, సొంత వెబ్‌సైట్‌లోనూ వీటిని ప్రదర్శించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజుల వివరాలు వెల్లడించని స్కూళ్లకు వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రైవేటు స్కూళ్లు డేటా ఇచ్చిన వాటి వివరాలు
జిల్లా పేరు మొత్తం స్కూళ్లు లెక్కలిచ్చినవి పెండింగ్
నిజామాబాద్ 557 06 551
మెదక్ 118 03 115
వరంగల్ 272 02 270
హైదరాబాద్ 2,243 01 2,242
ఖమ్మం 347 01 346
మంచిర్యాల 237 01 236
యాదాద్రి 178 01 177
ఆసిఫాబాద్ 115 01 114
రంగారెడ్డి 1,968 00 1,968
మేడ్చల్ 1,916 00 1,916
