కొత్తగా 19 అదనపు తహసీల్దార్ పోస్టులు

కొత్తగా 19 అదనపు తహసీల్దార్ పోస్టులు
  • అర్బన్​ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు : వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా పట్టణ మండలాల్లో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు 19 అదనపు తహసీల్దార్ల పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఒకే తహసీల్దార్‌పై పనిభారం పెరగడం వల్ల వివిధ చట్టబద్ధమైన విధులు, ప్రజా ఫిర్యాదులు, కోర్టు కేసులు  క్షేత్రస్థాయి తనిఖీల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని గుర్తించిన ఉన్నతాధికారులు.. పని విభజన చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగా పలువురు నాయబ్ తహసీల్దార్లకు తాత్కాలిక ప్రాతిపదికన తహసీల్దార్ కేడర్‌లోకి పదోన్నతి కల్పిస్తూ వివిధ పట్టణ మండలాలకు అదనపు తహసీల్దార్‌లుగా కేటాయించారు.  ఈ ఉత్తర్వుల ప్రకారం.. అకుల రవిని హనుమకొండకు, జీ ఆనంద్ కుమార్,  మహమ్మద్ ఖాదర్‌లను మంచిర్యాలకు, ఎం రంజిత్ కుమార్‌ను మహబూబాబాద్‌కు బదిలీ చేస్తూ పోస్టింగులు ఇచ్చారు. మహమ్మద్ జైనుల్ ఆబిదీన్‌ను కామారెడ్డికి, దురిశెట్టి శ్రీధర్ , వీ శైలజలను పెద్దపల్లికి, జీ కిరణ్ కుమార్ రెడ్డిని జగిత్యాలకు కేటాయించారు.

అలాగే..ఐ. పవన్ కుమార్‌ను భద్రాద్రి కొత్తగూడానికి, ఎస్. రాజ రేణుకను ఖమ్మంకు, ఎల్ భాస్కరమూర్తి , మహమ్మద్ యూసుఫ్ ఖురేషీలను వరంగల్‌కు, హనుమండ్ల వినయ్ , కె. లక్ష్మణ్‌లను నిజామాబాద్‌కు అదనపు తహసీల్దార్‌లుగా పంపారు. ఎం.ఎస్. గౌతమ్‌ను హనుమకొండకు, గుగ్గిళ్ల వేణును ఆదిలాబాద్‌కు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.