శ్రీశైలం నుంచి నీటిని తరలించే అక్రమ మార్గాలన్నీ మూసేయండి

శ్రీశైలం నుంచి నీటిని తరలించే అక్రమ మార్గాలన్నీ మూసేయండి

హైదరాబాద్, వెలుగు: చెన్నైకి తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడితే శ్రీశైలం నుంచి ఏపీ నీటిని తరలించే అక్రమ మార్గాలన్నీ మూసేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ తో పాటు వెలిగోడు, చెట్టముక్కలపల్లి వద్ద రియల్ టైమ్​అక్విజేషన్ సిస్టమ్ లు ఏర్పాటు చేసి ఎంత నీటిని తరలిస్తున్నారో లెక్కలు చెప్పాలని కోరింది. శుక్రవారం కేఆర్ఎంబీ చెన్నై వాటర్ సప్లై కమిటీ మీటింగ్ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. చెన్నైకి తాగునీటి కోసం శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల లెవల్ మెయింటెయిన్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కల్వకుర్తి ఎత్తిపోతలను కట్టడి చేయాలని ఏపీ ఈఎన్సీ వాదించారు. దీనికి తమిళనాడు ఈఎన్సీ వంతపాడారు. శ్రీశైలానికి పుష్కలంగా వరద వచ్చినా తెలంగాణ కల్వకుర్తి నుంచి నీటిని తరలిస్తుండడంతో తమకు తాగునీటికి ఇబ్బంది ఎదురవుతోందని చెప్పారు. దీన్ని తెలంగాణ ఇంజనీర్లు తిప్పికొట్టారు. చెన్నైకి తాగునీటి కోసం శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలని బచావత్ ట్రిబ్యునల్ తో పాటు ప్లానింగ్ కమిషన్ నివేదికలోనూ ఎక్కడ లేదన్నారు. 

చెన్నైకి తాగునీటి సరఫరాకు 15 రోజులు చాలు

చెన్నైకి తాగునీటి కోసం 15 రోజులు నీటిని తరలిస్తే సరిపోతుందని తెలంగాణ ఇంజనీర్లు వాదించారు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లో తాగునీటికి రోజుకు 1,500 క్యూసెక్కులు మాత్రమే తరలించాల్సి ఉండగా, పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలిస్తూ అందులోంచి 11,100 క్యూసెక్కులు చెన్నైకి తరలిస్తున్నారని తెలిపారు. ఈ లెక్కన చెన్నైకి ఇవ్వాల్సిన 15 టీఎంసీలను 15 రోజుల్లో తరలించవచ్చని చెప్పారు. ఏపీ ఇంజనీర్లు జోక్యం చేసుకొని 15 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు తమ దగ్గర లేవని, కండలేరులో చెన్నై కోసం 5 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలమని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారో లెక్కిస్తున్నప్పుడు బనకచర్ల వద్ద సెన్సార్లు ఏర్పాటు చేయాలనే వాదన సరికాదన్నారు. బోర్డు చైర్మన్ జోక్యం చేసుకొని ఈ అంశాలపై ఫుల్ బోర్డు మీటింగ్ లో చర్చిద్దామని సూచించారు. చెన్నై వాటర్ సప్లై కోసం శ్రీశైలం లేదా కండలేరు నుంచి పైప్ లైన్ ప్రాజెక్టు చేపట్టే అంశం ఎక్కడిదాక వచ్చిందని వివరాలు అడిగారు. తమిళనాడు ఈఎన్సీ స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టు ఫిజిబులిటీ సర్వేకు ఏడాది టైమ్ పడుతుందని, ఈ ప్రాజెక్టు తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. పుండి రిజర్వాయర్ రిపేర్లు చేస్తున్నామని, ఈ పనులు ఆగస్టు నాటికి పూర్తవుతాయని.. సెప్టెంబర్ లో తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. ఏపీ ఇంజనీర్లు స్పందిస్తూ తాగునీటికి 12 టీఎంసీలు ఇప్పటికే విడుదల చేశామన్నారు.