- లక్ష నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ఇద్దరు దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డును భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఇస్తున్న లక్ష రూపాయలను ఏకంగా రెండు లక్షలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 1లక్ష ఇన్సెంటివ్ అందుతుండగా.. దాన్ని ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచింది.
శనివారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ జీవో నెంబర్1 విడుదల చేశారు. ఈ పెరిగిన ప్రోత్సాహకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పెండ్లి చేసుకున్న దివ్యాంగ జంటలో.. ఆ నగదు మొత్తాన్ని భార్య పేరు మీదనే అందజేస్తారు. కొత్తగా పెండ్లి చేసుకున్న జంట ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సాయం పెంచాలని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతితో ఇన్సెంటివ్ ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
