- అంగన్‌వాడీలకూ సెలవులు.. ఇంటికే పౌష్టికాహార సరుకులు
హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు శనివారం నుంచే సెలవులు ప్రారంభమయ్యాయి. స్కూళ్లకు ఈ నెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు 21 వరకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు 25 వరకు హాలిడేస్ ఇచ్చారు. ఇతర వర్సిటీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. కొన్ని అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీలకు ఈ నెల 17 నుంచి 20 వరకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరగా, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.
ప్రైవేట్ విద్యాసంస్థలు టీచర్లకు కూడా దసరా సెలవులు అమలు చేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ కోరారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు శనివారం నుంచి ఈ నెల 21 వరకు 12 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవుల తర్వాత ఈ నెల 22 నుంచి కేంద్రాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. చిన్నారులు, గర్భిణులు, 12 రోజులకు సరిపడా సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
