తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే: కిషన్ రెడ్డి

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే: కిషన్ రెడ్డి

గడిచిన తొమ్మిదన్నర సంవత్సరాల్లో నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ మోసం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.అన్నీ వర్గాలను మోసం చేసి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ తరపున అంబర్ పేట ప్రేమ్ నగర్ లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం  నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు పోవాలన్నా.. ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలన్నా, ధ్వంసం అయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్నా.. మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని అన్నారు. అంబర్ పేటలో  బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతిపక్ష  కార్యకర్తలపై బెదిరింపులు, అక్రమ కేసులు పెడుతూ ప్రజలపై అనేక రకమైన వేధింపులకు గురిచేశారు.

ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా దోపిడి జరుగుతుందని మండిపడ్డారు. గతంలో తాను బీజేపీ  ఎమ్మెల్యేగా  ఉన్నప్పుడు 21  స్కూళ్లు కట్టించానని చెప్పారు. ఇవే కాకుండా ఒక బీసీ హాస్టల్, ఐదు సబ్ స్టేషన్లను ,100 నూతన కమ్యూనిటీ హాల్ లను నిర్మించానని తెలిపారు. అంబర్ పేటలో మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గడిచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలపాలని అన్నారు. అంబర్ పేటలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి, మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణం  చేశామన్నారు.  అంబర్ టలో వరదనీటితో ఇండ్లు ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.