బీసీ ఓటు బ్యాంకుపై కమలం నజర్

బీసీ ఓటు బ్యాంకుపై కమలం నజర్
  • తెలంగాణ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాలకు పదును
  • హైదరాబాద్ లో బీసీ గర్జన కు ప్రణాళికలు
  • ప్రధాని మోదీని రప్పించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్: బీసీ ఓటు బ్యాంకుపై కమలనాథులు ప్రధానంగా దృష్టి పెట్టారు. జనాభాలో ఎక్కువ భాగం ఉన్న బీసీల ఓట్లను రాబట్టుకొనేందుకు బీసీ గర్జన నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఇందుకోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీని రప్పించాలని భావిస్తున్నది. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన ఈ సభలో తాము బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించాలని బీజేపీ భావిస్తున్నది. 

ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో 27 మంది ఓబీసీలకు బీజేపీ అవకాశం కల్పించింది. రాష్ట్రంలోనూ కీలక పదవులను బీసీలకు అప్పగించింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలపైనా బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. వాటిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తోంది. 

ఎస్టీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత కేవలం తమ పార్టీకే దక్కుతుందని చెప్పించే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకుపెద్దగా సీట్లు కేటాయించకపోవడం, కాంగ్రెస్ పార్టీ సైతం తొలివిడతలో కేవలం 12 సీట్లే ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి దగ్గరవడం ద్వారా లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది.