తియ్యండ్ర బండ్లు.. ప్రచారానికి కొత్త కార్లను కొంటున్న ఎమ్మెల్యేలు

తియ్యండ్ర బండ్లు.. ప్రచారానికి  కొత్త కార్లను కొంటున్న ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అభ్యర్థులంతా ప్రచారాలకు సిద్దమయ్యారు.  అటు బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే 115 మందికి టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో అభ్యర్థులంతా ప్రచారానికి అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రచార వాహనాలను ఎన్నికల సమరానికి ముస్తాబు చేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి  దాదాపు డజను వాహనాలను కొనుగోలు చేశారు. డబ్బులు ఎన్నైనా సరే..వాహనాలు మాత్రం ఖరీదైనవిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఎమ్మెల్యేలు ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్ వంటి ఖరీదైన వాహనాలను కొని పెట్టుకున్నారు.  ఒక్కో  ఎమ్మెల్యే దాదాపు 10 వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రచార సమయంలో గ్రామాలు, మండలాల్లో తమ అనుచర బలగంతో  కార్లలో వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయొచ్చన్నది వారి ఆలోచన.

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భరత్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇప్పటికే లేటెస్ట్ వెర్షన్ వాహనాలను కొనుగోలు చేశారు. అంతేకాకుండా తమ అనుచరులతో ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిద్దరే కాదు..నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కూడా హైదరాబాద్ లోని పలు షోరూమ్ లలో కార్ల కోసం ఆర్డర్లు ఇచ్చారట. కార్ల షోరూమ్ ఓనర్లు కూడా ఎన్నికల ప్రచారానికి భారీగా వాహనాల కొనుగోలుకు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉండటంతో  ఎక్కువ సంఖ్యలో  కార్లను షోరూమ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆర్డరిస్తే..వెంటనే కార్లను వారి నియోజకవర్గాలకు తరలించేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. 

మరి కొందరు ఎమ్మెల్యేలు అయితే కార్ల కోసం భారీగా డబ్బులు వెచ్చించడం ఎందుకని..అద్దెకు తీసుకుంటున్నారు. మరికొందరైతే ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కార్లను కూడా ఎన్నికల ఖర్చులో  జమ చేయొచ్చన్నది ఆలోచన. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు..ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఈ సారి గట్టిగా ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. డబ్బులు ఎన్ని అయినా ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నారు.