తెలంగాణలో సర్... 24 లక్షల ఓట్లు ఔట్!

తెలంగాణలో సర్... 24 లక్షల ఓట్లు ఔట్!
  • డూప్లికేషన్, పర్మినెంట్ ​షిఫ్ట్, 
  • చనిపోయిన ​ఓటర్ల ఎన్యుమరేషన్​ ఫారాలు రాలే
  • వచ్చే నెల 3 తర్వాత డ్రాప్ట్​ జాబితాతో 
  • ఈ సంఖ్య మరింత పెరిగే చాన్స్​
  • సర్ ప్రక్రియలో భాగంగా 
  • కొనసాగుతున్న దరఖాస్తుల సేకరణ
  • ఇంకా కోటి 2 లక్షల ఓటర్ల 
  • వివరాలు డిజిటైజ్​ చేయాలి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)  ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 24 లక్షల ఓట్లు పోయినట్టేనని అధికారులు చెప్తున్నారు. మరణించినవారివి, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారివి, డూప్లికేషన్ ఓటర్లవి ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగిరాలేదని బీఎల్ఓలు ఎన్నికల సంఘానికి ఆన్​లైన్​లో సమాచారాన్ని అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేశారు. సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ఓట్లన్నీ డ్రాప్ట్​ జాబితాకు దూరం కానున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. శుక్రవారం నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 71.34 శాతం పూర్తయింది.ఇప్పటివరకు మొత్తం 2.41 కోట్ల ఓటర్ల దరఖాస్తులను అధికారులు ఆన్​లైన్​చేసినట్టు ఈసీ వెల్లడించింది. 

మరణించిన ఓటర్లు దాదాపు 6.50 లక్షలు..

బీఎల్ఓలు నిర్వహించిన క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయకూడని (అన్‌‌‌‌‌‌‌‌కలెక్టబుల్) దరఖాస్తులు భారీగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు సేకరించిన గణాంకాల ప్రకారం అన్‌‌‌‌‌‌‌‌కలెక్టబుల్ కేటగిరీ కింద 24 లక్షల ఓట్లు  చేరాయి.

ఇందులో మరణించిన ఓటర్లు దాదాపు 6.50 లక్షల ఉండగా.. శాశ్వతంగా నివాసాలు మార్చుకున్న వారు 12 లక్షలకు పైగా ఉన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగి ఇక్కడ కూడా నమోదైన డూప్లికేట్ ఓటర్లు 2.60 లక్షల మంది ఉన్నారని, ఆచూకీ లేనివారు (అబ్సెంట్​) 78  వేల మంది ఉన్నట్టు బీఎల్ఓలు నమోదు చేశారు. వీటితో పాటు ప్రాథమికంగా గుర్తించిన డూప్లికేట్ ఓటర్ల సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ దరఖాస్తులేవీ తిరిగి డిజిటలైజేషన్ ఎంట్రీ కాకపోవడంతో దాదాపు 25 లక్షల ఓట్లు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. వచ్చే నెల 3 తరువాత డ్రాప్ట్​ రోల్స్​ ప్రచురిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్న వాళ్లు ఒక్క చోటుకే పరిమితం కావడం, ఉపాధి, వివాహాలు, ఇతర కారణాల వల్ల శాశ్వతంగా నివాసాలు మారడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, సరైన పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈ ఓటర్లను అన్​ కలెక్టబుల్​ ఎన్యమురేషన్​ దరఖాస్తుల కింద నమోదు చేస్తున్నారు. 

ఇప్పటి వరకు 71 శాతంపైనే 

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న జిల్లాల్లో రికార్డు స్థాయిలో నమోదు పూర్తవ్వగా.. అర్బన్​ జిల్లాల్లో మాత్రం కొంత నెమ్మదిగా సాగుతోంది. నమోదు కావాల్సిన నాన్-డిజిటలైజ్డ్ ఫారాలు ఇంకా 1,02,18,238 (30.21%) ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 91.85 శాతం డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా.. జనగామలో 87.54%, మెదక్ 86.95%, సిద్దిపేట 86.64%, నల్గొండ 86.10%, సూర్యాపేట 84.93%, కామారెడ్డి 84.80% జిల్లాలు ఎన్యుమరేషన్​ ఫారంల వివరాల డిజిటలైజేషన్​లో ముందున్నాయి. అయితే, ఓటర్ల సంఖ్య భారీగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం డిజిటలైజేషన్ మందకొడిగా సాగుతోంది. హైదరాబాద్ జిల్లాలో 47.36 లక్షల ఓటర్లకు గాను కేవలం 22.51 లక్షల ఫారాలు నమోదు కావడంతో 47.53 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజిగిరిలో 48.77 శాతం, రంగారెడ్డి జిల్లాలో 56.50 శాతం మాత్రమే నమోదు పూర్తికావడం గమనార్హం.