
- 103 కాలేజీలకు ఫైనల్ ఫీజులు ఖరారు
- మూడేళ్ల పాటు ఇవే అమల్లో
- కోర్టుకెళ్లని 88 కాలేజీలకు తాత్కాలిక ఫీజు
- సీబీఐటీలో ఎక్కువగా రూ.1.34 లక్షలు
- నేటి నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ ఫీజులు ఖరారయ్యాయి. కోర్టుకెళ్లిన 80 కాలేజీలు, కోర్టుకు పోని మరో 23 కాలేజీలు సహా103 కాలేజీల ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఫిక్స్ చేసింది. కోర్టుకెళ్లని మరో 88 కాలేజీలకు తాత్కాలిక ఫీజును ఖరారు చేసింది. శనివారం నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే మూడేళ్ల పాటు ఇవే ఫీజులు అమల్లో ఉండనున్నాయి. ఫీజులు ఖరారు చేయాల్సిందిగా రాష్ట్రంలోని 191 ఇంజనీరింగ్ కాలేజీలు జనవరిలో ఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, కమిటీకి చైర్మన్ లేకపోవడంతో అది ఆలస్యమైంది. దీంతో 80 కాలేజీలు హైకోర్టుకెళ్లాయి. ఏఎఫ్ఆర్సీకి తాము ప్రతిపాదించిన ఫీజులను వసూలు చేసుకునేలా ఉత్తర్వులను తెచ్చుకున్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితం ఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించడం, ఆయన కాలేజీల ఫీజులను నిర్ణయించడం చకచకా జరిగిపోయాయి. తాత్కాలిక ఫీజులతో కౌన్సెలింగ్ నిర్వహిద్దామని కోర్టుకెళ్లిన మేనేజ్మెంట్లకు ఆయన సూచించారు. అందులో భాగంగా గతంలో రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల్లో 15 శాతం, రూ.50 వేల కంటే తక్కువ ఫీజులున్న కాలేజీల్లో 20 శాతం పెంపునకు ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదించింది. అయితే దాన్ని కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించాయి. అయినా కూడా ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే కమిటీ ఖరారు చేసింది. దీంతో పాటు కాలేజీల్లో స్పెషల్ఫీజు వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకోవాలనీ ఆదేశించింది.
సీబీఐటీలోనే ఎక్కువ
ప్రభుత్వం ఖరారు చేసిన ఇంజనీరింగ్ ఫీజుల్లో ఎక్కువగా సీబీఐటీలోనే ఉంది. ఆ కాలేజీకి ₹1.34 లక్షల ఫీజును ప్రభుత్వం ఫిక్స్ చేసింది. కోర్టుకు వెళ్లిన శ్రీనిధి, వాసవి కాలేజీల్లో రూ.1.30లక్షలు, సీవీఎస్ఆర్(అనురాగ్)తో పాటు వర్థమాన్ కాలేజీల్లో రూ.1.25 లక్షల ఫీజు ఖరారైంది. అతితక్కువగా అరోరా గ్రూప్స్‌కు చెందిన ఏయూఆర్పీ, ఏయూఆర్డీ, ఏయూఆర్ఎన్ కాలేజీల్లో మినిమమ్ ఫీజు ₹35 వేలకే పరిమితం చేసింది. గోకరాజు రంగరాజు కాలేజీలో రూ.1.22 లక్షలు, బీవీఆర్ఐ కాలేజీలో రూ.1.20 లక్షలు, విజ్ఞాన్జ్యోతిలో రూ.1.15 లక్షల ఫీజు ఖరారైంది. మొత్తం పూర్తిస్థాయి ఫీజు ఫిక్సైన103 కాలేజీల్లోని 18 కాలేజీల్లో రూ.లక్షకు పైగా ఫీజు ఉంది. కోర్టుకు వెళ్లని 88 కాలేజీల్లో అత్యధికంగా కిట్స్‌లో రూ.1,20,750, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతిలో రూ.1,13,275, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో రూ.1,09,250 ఫీజు ఉంది.
నేటి నుంచి 8 వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
ఎంసెట్ వెబ్ ఆప్షన్లు శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే, సీట్ల కేటాయింపు తేదీని ప్రకటించకపోవడంతో స్టూడెంట్లు అయోమయంలో పడ్డారు.