- అమలుకాని మార్కెట్ ఇంటర్వెన్షన్, నామమాత్రంగా మారిన ఈ-నామ్
- రాష్ట్రంలో ఏ పంటలకూ దక్కని కనీస మద్దతు ధర
- పల్లి, పసుపు, శనగ, మక్క,
- పొద్దు తిరుగుడు, జొన్న రైతుల ఇబ్బందులు
- ఒక్కో క్వింటాల్‌కు రూ. వెయ్యి వరకు నష్టపోతున్న రైతులు
హైదరాబాద్/ సిద్ధిపేట, వెలుగు: రాష్ట్రంలో మక్క, జొన్న, పల్లి, పసుపు, శనగ, సన్‌ఫ్లవర్‌లాంటి పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. ఆయా పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే 30% నుంచి 35% తక్కువ ధర లభిస్తున్నది. ప్రధానంగా మక్క మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 కాగా, బహిరంగ మార్కెట్‌లో కేవలం రూ.1,600 నుంచి1,800 మధ్యే పలుకుతోంది. ఆయా వ్యవసాయ ఉత్పత్తులకు యేటా ఎంఎస్‌పీ ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కొనుగోళ్ల విషయంలో పూర్తిగా చేతులెత్తేస్తోంది. మరోవైపు ఊరూరా కేంద్రాలు పెట్టి, వడ్లను కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పంటల వైపు కన్నెత్తిచూడడం లేదు. దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లన్నీ దళారుల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాగానే వ్యాపారులంతా సిండికేట్‌గా మారడం, కొనుగోళ్లను, రేట్లను నియంత్రించడం సర్వసాధారణమైంది. ఇలాంటి సమయాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఎంఎస్‌పీకి చట్టం చేయకపోవడంతో వ్యాపారులు మద్దతుధరకు మంగళం పాడుతున్నారు. ఒక్కో క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు కోతలు పెట్టడంతో ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్న నిలువుదోపిడీకి గురవుతున్నాడు.
కొనుగోళ్లలో ఆలస్యం.. మక్క రైతుల ఆందోళన
ఈ సీజన్‌లో తెలంగాణలో మక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. సుమారు 12.94 లక్షల ఎకరాల్లో పంట సాగైంది.
దీంతో మార్కెట్‌లోకి మక్కలు పోటెత్తాయి. క్వింటాల్ మక్కలకు మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ, వ్యాపా రులు మాత్రం రూ.1,600 నుంచి రూ. 1,800 మధ్యే చెల్లిస్తున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు తగినన్ని లేకపోవడం, ఇన్‌టైంలో ప్రారంభించకపోవడం, గన్నీ సంచుల కొరత, రవాణా సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు సెంటర్లను మండల కేంద్రాలకే పరిమితం చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు రవాణా భారాన్ని భరించలేక అగ్గువకు దళారులకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన ప్లాంతాల్లో గన్నీ సంచులు, లారీలు లేక కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం ములుగు, సిద్దిపేటతో పాటు ప్రాంతాల్లో రైతులు ధర్నాలకు దిగారు. గడిచిన నెల రోజులుగా కొనుగోళ్లు జరగకపోవడం, మరో వైపు వర్షాలు పడుతుండడంతో పంట పాడయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వానంగా పసుపు రైతుల పరిస్థితి
పసుపు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. మిర్చి, పసుపులాంటి వాణిజ్య పంటలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎంఎస్‌పీ ప్రకటించదు. వీటికి ధరల స్థిరీకరణ నిధి లేదా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రేటు నిర్ణయిస్తారు. ప్రస్తుతం వీటికి కూడా నాణ్యతను బట్టి ఆశించిన ధర లభించడం లేదు. ఉదాహరణకు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో క్వింటాల్ పసుపు రూ.17 వేలు పలుకుతుండగా.. నిజామాబాద్, జగిత్యాల మార్కెట్లలో మాత్రం రూ.13 వేలకే పరిమితం అవుతోంది. ఇక్కడి వ్యాపారులు సిండికేట్‌గా మారి తమకు ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తుండడంతో రైతులు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని, దీనిని ఆహార పంటగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు.
నిలిచిన శనగ కొనుగోళ్లు
తెలంగాణలో ఈ యాసింగి సీజన్‌లో 2 లక్షల టన్నుల శనగల దిగుబడిని అధికారులు అంచనా వేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం 29 వేల టన్నుల శనగల కొనుగోలుకే పర్మిషన్ ఇచ్చింది. లక్ష్యం పూర్తికావడంతో మార్క్‌ఫెడ్ ఆఫీసర్లు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు. దీంతో మిగిలిన పంటను ఎవరికి అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శనగల మద్దతు ధర రూ.5,875 కాగా, మార్కెట్‌లో మాత్రం క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ. 5 వేలు మాత్రమే పెడ్తున్నారు.
ఊరించి ఉసూరుమనిపించిన పల్లీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సీజన్‌లో భారీగా వేరుశనగ పండింది. జనవరి మొదట్లో క్వింటాల్‌కు రూ.12,667 పలికిన పల్లి రేటు కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రూ.9,790కి పడిపోయింది. అప్పట్లో మార్కెట్మాయాజాలానికి ఒక్కో క్వింటాల్‌పై రూ.3వేల దాకా రైతులు నష్టపోయారు. నిజానికి పాలమూరులో పండించే పల్లీలో అఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రం లేకపోవడంతో విదేశాలకు ఎగుమతి రకంగా పరిగణిస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులూ ఇక్కడి వేరుశనగను కొనేందుకు పోటీ పడుతుంటారు. కానీ ఈసారి గుజరాత్‌లో ఈ తరహా పల్లీ దిగుబడులు పెరగడంతో మన దగ్గర రేట్లు ఉన్నఫలంగా తగ్గాయని వ్యాపారులు చెప్పారు.
సన్‌ఫ్లవర్ రైతుల అరిగోస..
సిద్దిపేట జిల్లాలో ఈసారి 10 వేల ఎకరాల్లో సన్‌ఫ్లవర్ పండింది. నెల రోజుల క్రితం మార్కెట్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభం కాగా, పది రోజుల వ్యవధిలో దాదాపు 22 వేల టన్నుల పొద్దుతిరుగుడును మార్క్ ఫెడ్ కొనుగోలు చేసింది. కేంద్రం ఇచ్చిన టార్గెట్ పూర్తి అయిందని సుమారు 25 రోజుల క్రితం కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో సన్ ఫ్లవర్ అమ్మడానికి పంటతో మార్కెట్ యార్డులకు వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. వివిధ మార్కెట్ యార్డుల్లో దాదాపు 7 వేల టన్నుల సన్‌ఫ్లవర్ పేరుకుపోయింది. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి తెరతీశారు. కేంద్రం క్వింటాల్ సన్ ఫ్లవర్ కు రూ.7,721 ప్రకటించగా, రూ.6 వేల లోపే కొనుగోలు చేస్తున్నారు.
మక్క, సోయాబీన్‌పై వాణిజ్య ఒప్పందాల ప్రభావం
అమెరికాతో కేంద్ర ప్రభుత్వ వాణిజ్య ఒప్పందాల ప్రభావం వల్ల స్థానికంగా మక్క, సోయాబీన్ ధరలు పడిపోతున్నాయి. దిగుమతులు పెరిగితే దేశీయ రైతులకు మరింత నష్టం కలగవచ్చని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా, బ్రెజిల్‌లాంటి దేశాల్లో ఉత్పత్తి పెరగడం వల్ల అంతర్జాతీయంగా మక్కజొన్న ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రాష్ట్రంలో 29 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, కేంద్రం మాత్రం కేవలం 8 లక్షల టన్నుల (25%) కొనుగోలుకే అనుమతించింది. దీని వల్ల మిగిలిన పంటనంతా దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అరకొరగా ఈ-నామ్ అమలు
పంటలకు మెరుగైన ధరలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ–నామ్ వ్యవస్థ అమలులో పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలు సరిగా జరుగకపోవడం, ఈ విధానంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో దాని ప్రయోజనం అందడం లేదు. స్థానిక వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను తప్పుదారి పట్టించి పంటలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో రైతులను ఆదుకోవడానికి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని, కొనుగోలు పరిమితులను ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జొన్నలు, శనగలు కొనాలంటూ ఆదిలాబాద్‌లో రాస్తారోకో
జొన్నలను, శనగలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం భోరజ్ వద్ద నేషనల్ హైవేపై రైతులు రాస్తారోకో చేశారు. వారికి మద్దతుగా మాజీమంత్రి జోగురామన్న పాల్గొన్నారు. 5వ తేదీలోగా శనగ కొనుగోళ్లను కూడా ప్రారంభించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని విమర్శించారు.
బార్దాన్ కోసం సిద్దిపేటలో రోడ్డెక్కిన రైతులు
సిద్దిపేట మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డెక్కారు. బార్దాన్ లేకపోవడం వల్లే సమస్య వచ్చిందని, వెంటనే గన్నీ సంచులు సప్లై చేయాలని డిమాండ్‌చేశారు. ఈమేరకు శనివారం రాజీవ్ హైవేపై రాస్తారోకో చేశారు. బార్దాన్ కోసం వెళ్తే రేపు మాపంటూ అధికారులు తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోతో రాజీవ్హైవేపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట మండలం రాఘవాపూర్ , పెద్దలింగాపూర్, రాఘవాపూర్, రావురూకుల గ్రామాల్లోనూ ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశారు.
మక్కలు కొనాలంటూ రైతుల ఆందోళన
మక్కల కొనుగోళ్లు వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో శనివారం ములుగు జిల్లా మల్లంపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. మార్క్ ఫెడ్ ద్వారా జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటుచేసినా ఎక్కడా మక్కలు కొనడం లేదని, వర్షం వస్తే నిండా మునుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు రైతు సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి. హైవేపై ధర్నా చేయడంతో గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి.
25 రోజుల క్రితం సెంటర్లు ఏర్పాటుచేసినా బార్దాన్, లారీలు పంపకపోవడం వల్లే కొనుగోళ్లు జరగడం లేదన్నారు. దీంతో చాలా మంది రైతులు దళారులకు క్వింటాల్ మక్కలను రూ.1800కే అమ్ముకుంటున్నారన్నారు. - ములుగు
పంట మద్దతు ధర మార్కెట్ ధర (అంచనా) రైతుకు నష్టం
మొక్కజొన్న 2,400 1,600 - 1,800 600 - 800
జొన్న 3,371 2000 -2500 871 -1371
పల్లి 6,783 5,500 - 6,000 800 - 1,200
కంది 8,000 7,000- 7,200 800 -1000
సోయాబీన్ 4,892 4,000 - 4,100 700 - 900
