- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా తయారైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాడి తప్పించిందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని, ఓ సీనియర్మంత్రి భార్యకు 10 శాతం కమిషన్ ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు అందుతున్నాయని, స్వయంగా కాంగ్రెస్ అనుబంధ సంఘం నేతలే ఈ ఆరోపణలు చేయడం ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని ఏలేటి చెప్పారు. గత నాలుగు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.34,900 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. నిమిషానికి రూ.20.20 లక్షల చొప్పున అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
వివిధ వర్గాలకు చెల్లించాల్సిన దాదాపు రూ.లక్ష కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, సింగరేణి, ఆర్టీసీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 30 నుంచి -40 ఏళ్లు పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులను పెన్షన్, ఇతర బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, మూసీ, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ పేరుతో వేల కోట్ల దోపిడీకి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు కేటాయింపుల్లో రూ.20 వేల కోట్ల అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాంట్రాక్టర్ల కమిషన్లు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ఏసీబీ, లోకాయుక్తతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
