- తెలంగాణది ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ స్టేటస్
- ‘మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్’లో పడకుండా జాగ్రత్తపడాలి
- విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ స్టేటస్‌లో ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ అన్నారు. ‘‘రిస్క్ తీసుకోవడంలో.. వ్యాపార దక్షతలో తెలుగు వారు ‘ఐరిష్ ఆఫ్ ఇండియా’ లాంటివారు. సాహసం, సంపద సృష్టించే గుణం మీ సొంతం” అని ప్రశంసించారు. దేశం రాబోయే 5 నుంచి 7 ఏండ్లలో ఏ ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ (ఎగువ మధ్య ఆదాయ) స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్నదో.. తెలంగాణ ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నదని తెలిపారు.
మంగళవారం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047’ ఆవిష్కరణలో సుమన్ బేరీ ప్రసంగించారు. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం.. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రస్తుతం ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ దేశాల సరసన నిలిచిందని తెలిపారు. దేశం మొత్తం ఈ మైలురాయిని చేరడానికి ఇంకా సమయం పడుతుందని, కానీ తెలంగాణ అప్పుడే ఆ ఘనత సాధించిందని అన్నారు.
అయితే, ఈ స్థాయికి చేరిన తర్వాతే అసలైన సవాల్ మొదలవుతుందని, ‘మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్’లో పడకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఇప్పటిదాకా రాష్ట్రం అనుసరించిన అభివృద్ధి నమూనా ఇకపై పని చేయకపోవచ్చని అన్నారు. ‘‘మీరు ఇప్పుడున్న స్థాయిలో కేవలం పెట్టుబడులు వస్తే సరిపోదు. సృజనాత్మకత , ఆవిష్కరణలు , ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అత్యంత కీలకం కానున్నాయి.
భవనాలు, నిర్మాణాలకంటే.. ఉత్పాదకత పెంచడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిబంధనల సరళీకరణపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది” అని వివరించారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తెలంగాణ తనకంటూ ఒక విజన్‌ను నిర్దేశించుకోవడం ప్రశంసనీయమని, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో నీతి ఆయోగ్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే కేవలం మౌలిక వనరులే కాదు, ఉత్పాదకత పెంచే దిశగా పాలసీలు ఉండాలని సూచించారు.
హైటెక్ సిటీ నాడు బోర్డు మాత్రమే.. నేడు అద్భుతం
హైటెక్ సిటీ అంటే 2006లో ఒక బోర్డు మాత్రమేనని.. కానీ నేడు చూస్తే అద్భుతంగా మారిందని సుమన్ బేరీ తెలిపారు.‘‘2006లో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమావేశం కోసం నేను హైదరాబాద్ వచ్చా. అప్పుడు హైటెక్ సిటీ అంటే కేవలం ఒక బోర్డు.. ఆశావహ దృక్పథం మాత్రమే కనిపించేది. అక్కడ ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూస్తే.. ‘మై గాడ్’.. అక్కడ ఎంత అద్భుతమైన ప్రపంచం వెలిసింది. తెలంగాణ ప్రజలు కలలు కనడంలో, వాటిని నిజం చేసుకోవడంలో సాటిలేని వారు అనడానికి ఇదే నిదర్శనం” అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ చెప్పినట్లు వికసిత భారత్ సాధనలో ప్రజల ఆత్మవిశ్వాసమే కీలకమని అన్నారు. ‘‘నీతి ఆయోగ్ మీకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సాయం చేసింది. కానీ, ఈ విజన్‌ను ప్రజల మెదళ్లలో నాటాల్సిన బాధ్యత, యువతకు కలలను పంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపితే అద్భుతాలు సృష్టిస్తారు” అని సూచించారు.

