పోలవరం ఎత్తు పెంచొద్దు.. డిమార్కేషన్ జరిగే దాకా ఆపండి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి

పోలవరం ఎత్తు పెంచొద్దు.. డిమార్కేషన్ జరిగే దాకా ఆపండి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి
  • రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్​ ప్రభావంపై సర్వే నడుస్తున్నది


హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపుపై ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో) ఆధ్వర్యంలో సర్వే జరుగుతున్నదని, అది పూర్తయి డిమార్కేషన్ అయ్యే దాకా ప్రాజెక్టు ఎత్తును పెంచొద్దని కోరింది. 

పీపీఏ సీఈవోకు ఈఎన్సీ జనరల్ ఇటీవల లేఖ రాశారు. నిరుడు ఏప్రిల్ లో జరిగిన పీపీఏ మీటింగ్ లో ప్రాజెక్టును రెండు దశల్లో చేపడుతున్నట్టు వెల్లడించారని గుర్తు చేశారు. “41.15 మీటర్ల ఎత్తుతో తొలి దశ, 45.72 మీటర్ల ఎత్తుతో రెండో దశ నిర్మిస్తారని చెప్పారు. తొలి దశలో ప్రాజెక్టు వల్ల తెలంగాణలో కలిగే ముంపుపై జాయింట్ సర్వేకు అంగీకరించారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముర్రేడు వాగు, కిన్నెరసాని ఉప్పొంగే ప్రమాదం ఉంది. 

వాటితో పాటు 36 వాగుల్లోని 6 పెద్ద వాటిపై డ్రైనేజీ కంజెషన్ పై స్టడీ చెయ్యాలని నిర్ణయించారు. ఇలాంటి సందర్భంలో ఏపీ అనధికారికంగా ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆయా వాగుల సర్వే పూర్తయి డిమార్కేషన్ చేసేంత వరకు రెండో దశను చేపట్టొద్దు. అలాగే పోలవరం లిఫ్ట్ పనులను ఆపెయ్యాలి” అని లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు.