- జేఎన్ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాట్లు పూర్తి
- 4వ తరగతి చదివే బాలబాలికలకు అడ్మిషన్లు
- ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిటీ
- ఈనెల 14న ఓపెన్ కానున్న స్పోర్ట్స్ స్కూల్
హనుమకొండ, వెలుగు: పాఠశాల విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ ను మంజూరు చేసింది. ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో శాశ్వత స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్ ను నిర్మించనుంది. అప్పటివరకు తాత్కాలికంగా హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు నాలుగు రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అందులో మౌలిక వసతులు కల్పించగా.. ఈ నెల14న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల ఎంపికకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా నియమించారు.
రాష్ట్రంలో నాలుగో స్పోర్ట్స్ స్కూల్
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో రీజినల్ స్పోర్ట్స్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేలు గత జులైలోనే సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో రాష్ట్రంలో నాలుగో స్పోర్ట్స్ స్కూల్ హనుమకొండలో ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాగా ఉనికిచెర్ల శివారులో రింగ్ రోడ్డు పక్కన సుమారు 135 ఎకరాల వరకు కుడా స్థలం ఉంది. అందులోని సర్వే నెం.325లో 20 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ స్కూల్ పర్మినెంట్ బిల్డింగ్ కట్టేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే స్పోర్ట్స్ స్కూల్ లో క్లాస్ లు ప్రారంభించాలనే ఉద్దేశంతో, టెంపరరీగా హనుమకొండ జేఎన్ఎస్ లోని బాయ్స్ హాస్టల్ లో ఏర్పాట్లు చేశారు.
ఈనెల14న ఓపెనింగ్
టెంపరరీగా స్పోర్ట్స్ స్కూల్ లో ఇప్పటికే విద్యార్థులకు సరిపడా రూమ్స్, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ, బెడ్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. గత ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించాలని అనుకున్నా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఆలస్యమైంది. కాగా గత నెల 29న ఉత్తర్వులు అందడంతో ఈనెల14న హనుమకొండ జేఎన్ఎస్ లో స్పోర్ట్స్ స్కూల్ ను ఓపెన్ చేసేందుకు లీడర్లు, ఆఫీసర్లు పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈనెల 5, 6 తేదీల్లో కౌన్సిలింగ్
2025 –-26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు 40 మంది బాలురు, 40 మంది బాలికలను కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా స్పోర్ట్స్ అథారిటీ నియమించింది. ఇందులో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జి.రవీందర్, హనుమకొండ డీవైఎస్ వో గుగులోత్ అశోక్ కుమార్, సరూర్ నగర్, ఎ
ల్ బీ స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు ఈ.వెంకటేశ్వరరావు, ఎం.రవికుమార్, జిమ్నాస్టిక్ కోచ్ బి.దేవిక, అథ్లెటిక్స్ కోచ్ ఎస్.శ్రీమన్నారాయణ, రెజ్లింగ్ కోచ్ ఎం.జైపాల్ ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల5న బాలురకు, 6న బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
80 సీట్లు.. 11 క్రీడాంశాలు
స్పోర్ట్స్ స్కూల్ లో బాల బాలికలు మొత్తంగా 80 మందికి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. వీరికి మొత్తం11 క్రీడాంశాల్లో శిక్షణ అందించనున్నారు. ఇందులో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, హ్యాండ్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్ ఉన్నాయి. ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు కోచ్ లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వులు అందాయి.
